ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వ పాఠశాలలో వెలుగు చూసిన దారుణం

23 Aug, 2019 13:25 IST|Sakshi

లక్నో: తినడానికి మూడు పూటలా తిండి దొరికితే చాలు అనుకునే కుటుంబాలు నేటికి మన దేశంలో కొకొల్లలు. ఈ క్రమంలో కనీసం ఓ పూటైనా కడుపు నిండా తిండి దొరుకుతుందనే ఉద్దేశంతో పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి పేద విద్యార్థులకు సరైన పోషకాహారం అందించేందుకు ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం తీసుకొచ్చింది. దీని కోసం ప్రతి ఏడాది కొన్ని వేల కోట్ల రూపాయాలు ఖర్చు పెడుతోంది. కానీ నేటికి కొన్ని ప్రాంతాల్లోని పాఠశాలల్లో విద్యార్థులకు పోషకాహారం కాదు కదా.. కనీస భోజనం కూడా సరిగా అందట్లేదు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో ఓ దారుణమైన సంఘటన వెలుగు చేసింది. మీర్జాపూర్‌ జిల్లాలోని కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పేరుతో కేవలం రొట్టెలు, కూరకు బదులుగా ఉప్పు ఇస్తున్నారు.  

మధ్యాహ్న భోజన పథకంలో చిన్నారులకు ప్రతిరోజు అన్నం, పప్పు, రొట్టె, కూరగాయాలు, పండ్లు, పాలు వంటి పోషకాహారం భోజనంగా ఇవ్వాలని అధికారులు ఈ పథకం తీసుకొచ్చారు. అయితే మీర్జాపూర్‌లోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మాత్రం ఇవేవీ కాకుండా కేవలం రొట్టెలు మాత్రమే పెడుతున్నారు. కనీసం కూర కూడా వండకుండా ఉప్పుతో తినమంటున్నారు. ఒకరోజు ఉప్పు, రొట్టెలు.. మరుసటి రోజు అన్నం, ఉప్పు ఇలా వారమంతా విద్యార్థులకు ఇదే భోజనం అందిస్తున్నారు. ఇలా ఓ ఏడాది నుంచి జరుగుతోంది. అయితే తాజాగా ఓ జాతీయ వార్తా సంస్థ కథనంతో ఈ దారుణం వెలుగు చూసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది.
 

‘గత ఏడాది కాలంగా ఈ పాఠశాలలో మా పిల్లలకు ఇదే భోజనం పెడుతున్నారు.  పాలు ఎప్పుడో ఒక్కసారి వస్తాయి. వచ్చినా వాటిని పిల్లలకు ఇవ్వరు. ఇక అరటిపండ్లు ఇంతవరకూ పంచలేదు’అని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. ఈ వ్యవహారం బయటకు రావడంతో అధికారులు విచారణ చేపట్టారు. ఇందుకు బాధ్యులైన గ్రామ పంచాయతీ సూపర్‌వైజర్‌, స్కూల్‌ ఇన్‌ఛార్జ్‌లను విధుల నుంచి సస్పెండ్‌ చేశామని వెల్లడించారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి ఇటీవల కాలంలో పశ్చిమ బెంగాల్‌లోని చిన్సురాలో గల ఓ బాలికల పాఠశాలలో చోటు చేసుకుంది. అక్కడ కూడా పిల్లలకు  ఉప్పు, అన్నం మాత్రమే పెడుతున్న వీడియో వైరల్‌ అయ్యింది. దాంతో ఇద్దరు టీచర్లను సస్పెండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు