-

మిడ్‌డే మీల్స్‌పై తప్పుడు లెక్కలు

19 Dec, 2015 05:12 IST|Sakshi
మిడ్‌డే మీల్స్‌పై తప్పుడు లెక్కలు

పథకం అమల్లోనూ అక్రమాలున్నాయి: కాగ్
♦ రైల్వే శాఖ తీరుతో లక్షకోట్ల నష్టం.. ఆర్మీ హెలికాప్టర్లలో రక్షణ కరువు
♦ పార్లమెంటు ముందు 2014 వరకు ప్రభుత్వ తీరుపై కాగ్ నివేదిక
 
 న్యూఢిల్లీ: పాఠశాల విద్యను ప్రోత్సహించేందుకు చేపడుతున్న మధ్యాహ్న భోజన పథకం లెక్కలన్నీ తప్పుడు తడకగానే ఉన్నాయని.. పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) మండిపడింది. చాలామంది పిల్లలు మంచి చదువుకోసం ప్రైవేటు పాఠశాలల్లో చేరుతున్నందున.. మధ్యాహ్న భోజన పథకంలో నమోదు చేసుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా తగ్గిందని తెలిపింది. ఈ పథకం అమల్లోనూ పెద్ద సంఖ్యలో అక్రమాలున్నాయని 2014 మార్చి వరకు.. వివిధ ప్రభుత్వ శాఖల తీరుపై సమర్పించిన నివేదికలో తెలిపింది. వివిధ ప్రభుత్వ విభాగాల్లోని సమస్యలనూ ఇందులో పేర్కొంది.

 ఆర్మీకి ‘రక్షణ’ కరువు.. భారత రక్షణ వ్యవస్థలో చాలా లోపాలున్నాయని కాగ్ స్పష్టం చేసింది. ఆర్మీ వాడుతున్న ఛీతా/చేతక్ హెలికాప్టర్లలో 40 ఏళ్ల పైబడినవి 51, 78 హెలికాప్టర్లు 30-40 ఏళ్లవని కాగ్ నివేదించింది. ఎక్కువ కాలం వీటి ద్వారా సేవలు పొందటం కష్టమని తెలిపింది.

 జవాన్లకు నివాసాలపై.. సరిపడినన్ని క్వార్టర్లు లేని కారణంగా కేంద్రీయ సాయుధ దళాలైన సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్‌లలో తీవ్రమైన అసంతృప్తి ఉందని కాగ్ నివేదిక పేర్కొంది. హోం మంత్రిత్వ శాఖనుంచి ఆదేశాలు వచ్చినా ఈ సాయుధ దళాల అధికారులు భూ సేకరణ, దీనికి పై అధికారుల ఆమోదం, ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చించకపోవటం ఇందుకు కారణంగా తెలిపింది.

 రైల్వేల్లో భారీ నష్టం.. 400కు పైగా ప్రాజెక్టుల అమలులో ఆలస్యం కారణంగా రైల్వే శాఖలో రూ. 1.07 లక్షల కోట్లు అనవసరంగా ఖర్చవుతున్నాయని కాగ్ మండిపడింది. అంచనాల రూపకల్పన, నిధుల విడుదలలో జాప్యం, ప్రాముఖ్యాలను గుర్తించటంలో వైఫల్యం కారణంగానే ఇంత భారీ నష్టం వాటిల్లుతోందని తెలిపింది. 2009-14 మధ్యలోనే 202 ప్రాజెక్టులు ఈ జాబితాలో చేరాయని స్పష్టం చేసింది.
 కోట్లు సముద్రం పాలు.. ముంబై సమీపంలో అరేబియా సముద్రంలో 1993లో బిడ్లకు ఆహ్వానించిన రత్న, ఆర్-సిరీస్ ఆయిల్, గ్యాస్ క్షేత్రాలను ఎస్సార్ కంపెనీకి అప్పగించే విషయంలో ఎన్‌టీఎస్ (నెగోషియేటింగ్ టీమ్ ఆఫ్ సెక్రటరీస్) నిర్లక్ష్యం వల్ల  26 వేల కోట్ల రూపాయల విలువైన హైడ్రోకార్బన్ల ఉత్పత్తికి నష్టంతో రూ. 1,086 కోట్లతో ఏర్పాటు చేసిన వసతులు వినియోగం లేక పాడైపోయినట్లు తెలిపింది.

మరిన్ని వార్తలు