త్రిపుల్‌ తలాక్‌పై మానుషి చిల్లర్‌..

28 Nov, 2017 08:59 IST|Sakshi

వైద్యవిద్యను అభ్యసిస్తూ.. ప్రపంచం మెచ్చిన అందగత్తె అయిన మానుషి చిల్లర్‌, దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన త్రిపుల్‌ తలాక్‌పై స్పందించారు. త్రిపుల్‌ తలాక్‌ రాజ్యాంగ విరుద్దమైన పద్ధతి అని చాలా క్లారిటీగా ఉందన్నారు. వివాహంపై ఒక్క వ్యక్తికే ఎక్కువ యాజమాన్యం ఉండకూడదని పేర్కొన్నారు. పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య చిగురించే ఎంతో ప్రత్యేకమైన స్నేహ భావమని, ఆ బంధంలో ఏ ఒక్కరికే ఎక్కువ యాజమాన్యం ఇవ్వలేమని తెలిపారు. త్రిపుల్‌ తలాక్‌ నుంచి లైంగిక వేధింపుల వరకు పలు సామాజిక అంశాలపై మానుషి మాట్లాడారు. దేశవ్యాప్తంగా మైనర్‌ బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలపై కూడా మానుషి చిల్లర్‌ స్పందించారు. పిల్లలను రక్షించే బాధ్యత అందరికీ ఉందని, వారికి సాధారణమైన జీవితం ఇవ్వాలన్నారు.

''మైనర్‌ బాలికలపై లైంగిక వేధింపుల గురించి మాట్లాడుకుంటే, పిల్లలను రక్షించే బాధ్యత ఎంతో ముఖ్యమైనదని నేను భావిస్తున్నా. మనం పిల్లలకు శక్తినిస్తే, అదే దేశానికి శక్తినిచ్చినట్టవుతుందిపిల్లలకు భద్రత కల్పిస్తే, వారి జీవితాల్లో అద్భుతాలు చేసి చూపిస్తారు. ప్రతి చిన్నారికి పెరిగే హక్కు ఉంటుంది'' అని అన్నారు. మూలాల నుంచి మార్పు రావాల్సి ఉందని, మహిళలకు గౌరవించే లక్షణం ఇంటి వద్ద నుంచే వచ్చేలా పిల్లలకు పాఠాలకు చెప్పాలని  పేర్కొన్నారు. విద్య ఎంతో ముఖ్యమైనదని, కేవలం పాఠశాలల్లోనే కాక, ఇంటి వద్ద కూడా దీన్ని నేర్పించాలని వివరించారు. ఇంటి వద్దే మహిళలను గౌరవించడం నేర్పిస్తే, సమాజంలో కూడా మహిళలను గౌరవించే లక్షణం నేర్చుకుంటారని చెప్పారు. ప్రస్తుతం బాలీవుడ్‌లోకి ఎంట్రీ అయ్యే యోచన లేదని, అయితే భవిష్యత్తులో వచ్చే అవకాశాలున్నాయా అనే దానిపై పూర్తిగా కొట్టిపారేయలేదు. కాగ, 17 ఏళ్ల తర్వాత మిస్‌ వరల్డ్‌ కిరీటాన్ని భారత్‌ నుంచి మానుషి చిల్లర్‌ గెలుచుకున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు