సైన్యం అమ్ములపొదిలోకి ఆకాశ్

6 May, 2015 02:20 IST|Sakshi
ఢిల్లీలో జరిగిన ఆకాశ్ అప్పగింత కార్యక్రమంలో ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్, ఇతర అధికారులు

- స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన అధునాతన క్షిపణి
- ఒకే సమయంలో బహుళ లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం
- శత్రువుల హెలికాప్టర్లు, విమానాలను నాశనం చేయగలదు
- మూడు దశాబ్దాల కృషి ఫలించిందన్న సైన్యాధిపతి

న్యూఢిల్లీ:
భారత రక్షణ శాఖ చరిత్రలో ఇదో ముఖ్యమైన ఘట్టం. అత్యంత అధునాతనమైన క్షిపణి భారత సైన్యం అమ్ములపొదిలో చేరింది. మూడు దశాబ్దాలకు పైగా చేసిన కృషి ఫలించింది. పూర్తి స్వదేశీ శాస్త్ర పరిజ్ఞానంతో రూపొందించిన ఉపరితల క్షిపణి ఆకాశ్ మన సైన్యానికి పెద్ద వరం కానుంది. హైదరాబాద్‌లోని రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) తయారుచేసిన ఈ క్షిపణి శత్రు దేశాల హెలికాప్టర్లు, విమానాలు, ద్రోణులను 25 కిలోమీటర్ల దూరం నుంచి సులభంగా ఛేదించగలదు.

మంగళవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఈ క్షిపణిని సైన్యానికి అధికారికంగా అందజేశారు. ఈ సందర్భంగా సైన్యాధిపతి జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ మాట్లాడుతూ.. ఈ క్షిపణి చేరికతో దేశ రక్షణ వ్యవస్థ మరింత పటిష్టమైందన్నారు. ఆకాశ్ తయారీ ప్రయాణం అంత సులువుగా సాగలేదని, దీని వెనుక మూడు దశాబ్దాల కృషి ఉందని చెప్పారు. ఈ క్రమంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాయన్నారు.

ఉపరితలం నుంచి గగనంలోని స్వల్పదూర లక్ష్యాలను 20 కిలోమీటర్ల ఎత్తు వరకు ఈ క్షిపణి ఛేదించగలదు. ఒకే సమయంలో బహుళ లక్ష్యాలను సైతం ఛేదించగలదు. అన్నిరకాల వాతావరణ పరిస్థితుల్లోనూ పనిచేసే సామర్థ్యమున్న ఆకాశ్ యుద్ధక్షేత్రంలో సైన్యానికి కవచంగా ఉంటుంది.  ఆర్మీలో చేరిన క్షిపణిని లాంచ్‌ప్యాడ్ నుంచి ప్రయోగించేందుకు, ఎక్కడికైనా తరలించేందుకు అనువుగా ఉంటుంది. అందువల్ల సైన్యం అవసరాల మేరకు దీన్ని వాడుకోవచ్చని ప్రాజెక్టు డెరైక్టర్ జి.చంద్రమౌళి పీటీఐతో చెప్పారు. 1984 నుంచి డీఆర్‌డీఓ రూపొం దించిన 5 కీలక క్షిపణుల్లో ఆకాశ్ ఒకటి.

మరిన్ని వార్తలు