ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు!

13 Aug, 2018 18:08 IST|Sakshi

న్యూఢిల్లీ : పంద్రాగస్టు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్న నేపథ్యంలో ఆయన ఏఎన్‌ఐ, ది టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాలకు ఇంటర్వ్యూ ఇచ్చిన విషయం తెల్సిందే. ఇందులో ఆయన ప్రధానంగా ఐదు అంశాల గురించి తన అభిప్రాయాలను వెల్లడించారు. ఉద్యోగాల కల్పన, దేశ ఆర్థిక వ్యవస్థ, అస్సాంలో దేశ పౌరులను గుర్తిస్తూ ఎన్‌ఆర్‌సీ విడుదల చేసిన జాబితా, దేశంలో పెరిగిపోతున్న మూక హత్యలు, 2019లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల గురించి ఆయన మాట్లాడారు. దేశాన్ని ఆర్థికంగా దివాలా తీయించిన ‘పెద్ద నోట్ల రద్దు నిర్ణయం’పై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పరోక్షంగా కూడా ప్రస్తావించలేదు. 

2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఏటా కొత్తగా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామంటూ నరేంద్ర మోదీ విస్తృతంగా చేసిన ప్రచారం యువత మీద ప్రధాన ప్రభావం చూపింది. ఈ విషయంలో ప్రభుత్వం ఏ మేరకు విజయం సాధించిందని ఇంటర్వ్యూలో మీడియా ప్రశ్నించగా, ఉద్యోగాలు బాగానే కల్పిస్తున్నామని, అయితే ఎన్ని ఉద్యోగాలో లెక్క తేల్చి చెప్పడానికి డేటా అందుబాటులో లేదని ఆయన అన్నారు. డేటా లేనంత మాత్రాన ఉద్యోగాలు కల్పించడం లేదనుకుంటే పొరపాటని ఆయన అన్నారు. 68 లక్షల ఉద్యోగాలు కల్పించామని బెంగాల్‌ ప్రభుత్వం, 53 లక్షల ఉద్యోగాలు కల్పించామని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించుకున్నాయని, అంటే ఇతర రాష్ట్రాలుగానీ, కేంద్రంగానీ ఉద్యోగాలు కల్పించడం లేదనుకోవాలా, అంటూ ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాల చేస్తున్న ఆరోపణలు తప్ప మరేమీ కాదని ఆయన అన్నారు. 

దేశంలో ఉద్యోగావకాశాలు పెరుగుతున్నట్లయితే గత జనవరి నెలలో ఓ టెలివిజన్‌కిచ్చిన ఇంటర్వ్యూలో  ‘పకోడీలు అమ్ముకోవడం ఉపాధి’ కాదా? అని స్వయంగా ఎందుకు ప్రశ్నించాల్సి వచ్చిందో మోదీకే తెలియాలి. ఆయన కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కారీ ఆగస్టు 4వ తేదీన మీడియాతో మరాఠాల రిజర్వేషన్ల అంశంపై మాట్లాడుతూ ‘రిజర్వేషన్లే అంగీకరించామనుకోండి, వారికి ఇవ్వడానికి ఉద్యోగాలు ఎక్కడ? ఐటీ కారణంగా బ్యాంకుల్లో కూడా ఉద్యోగాలు బాగా తగ్గిపోయాయి. ప్రభుత్వ నియామకాలే పూర్తిగా స్తంభించిపోయాయి. ఇంకెక్కడా ఉద్యోగాలు?’ అంటూ వ్యాఖ్యానించారు. ఇక్కడ మోదీకి భిన్నంగా ప్రతిపక్షాల్లో, ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్నే గడ్కారీ ఎందుకు మాట్లాడారు?

దళితులు, మైనారిటీలు, ఇతరులపై జరుగుతున్న మూక హత్యల గురించి నరేంద్ర మోదీ మాట్లాడుతూ దీనికి సంబంధించిన ప్రతి సంఘటన కూడా దురదృష్టకరమైనదేనని, వీటిని రాజకీయాలకు అతీతంగా చూడాలని అన్నారు. వీటిని తాను, తన పార్టీ స్పష్టంగా ఖండించామని, అందుకు సరైన ఆధారాలు కూడా ఉన్నాయని ఆయన అన్నారు. అలాంటప్పుడు మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి యశ్వంత్‌ సిన్హా కుమారుడు,  కేంద్ర మంత్రి జయంత్‌ సిన్హా, మూక హత్య దోషులకు దండలు వేసి, ఎందుకు స్వాగతం చెప్పారు? మరో కేంద్ర మంత్రి, మూక హత్య కేసులో ఓ దోషి చనిపోతే ఆయన మృతదేహంపై జాతీయ పతాకాన్ని ఎందుకు కప్పారు? వారి ప్రవర్తనను మోదీ ఎందుకు ఖండించలేదు? 

ఇక రానున్న సార్వత్రిక ఎన్నికల గురించి మోదీ మాట్లాడుతూ, ప్రతిపక్షాలది ఓటు బ్యాంకు రాజకీయాలని, స్వార్థ పూరిత రాజకీయాలని, అందుకోసమే వారంతా ఓ కూటమిగా ఏర్పడేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. తమది మాత్రం కేవలం ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కృషి చేసే ప్రభుత్వం, పార్టీ అని చెప్పారు. ఇలా అధికారం కోసం ఏకమయ్యే పార్టీలను ప్రజలు విశ్వసించరని, తమ పట్ల ప్రజలకు ఎంతో విశ్వాసం ఉందని, రానున్న ఎన్నికల్లో గతంలోకెల్లా ఎక్కువ మెజారిటీతో విజయం సాధిస్తామని మోదీ చెప్పారు. అయినా ఎన్నికల ముందు పొత్తులకు, ఎన్నికల అనంతరం పొత్తులకు చాలా తేడా ఉంటుందని ఆయన అన్నారు. బీహార్‌లో ఎన్నికలకు ముందే ఆర్జేడీ, జేడీయూలు పొత్తు పెట్టుకొని అధికారంలోకి రాగా, ఎన్నికల అనంతరం ఆర్జేడీతో బంధాన్ని తెంపేయించి జేడీయూతో పొత్తు పెట్టుకొని సంకీర్ణ ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామ్యం అవడం స్వార్థపూరిత రాజకీయం కాదా? త్రిపుర, ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికల అనంతరం అక్రమ పొత్తుల ద్వారా బీజేపీ అధికారంలోకి రావడాన్ని ఏమనాలి? తాము చేస్తే ఒప్పు, ఇతరులు చేస్తే తప్పా!

 

మరిన్ని వార్తలు