సముద్రంలో 122 ‘విమాన శకలాలు’

27 Mar, 2014 10:28 IST|Sakshi
సముద్రంలో 122 ‘విమాన శకలాలు’

 ఫ్రాన్స్ శాటిలైట్ చిత్రాల్లో గుర్తింపు
 

 కౌలాలంపూర్/పెర్త్: గల్లంతైన మలేసియా విమానం ఆచూకీ తెలుసుకోవడానికి అత్యంత విశ్వసనీయ ఆధారాలు దొరికాయి. దీని శకలాలుగా భావిస్తున్న 122 వస్తువులు దక్షిణ హిందూ మహాసముద్రంలో కనిపించాయి. ఫ్రాన్స్ ఉపగ్రహం వీటిని ఆదివారం గుర్తించి ఫొటోలు తీసింది. ఆస్ట్రేలియాలోని పెర్త్‌కు  2,557 కి.మీ దూరంలో వీటి ని గుర్తించినట్లు మలేసియా మంత్రి హిషాముద్దీన్ హుస్సేన్ బుధవారం తెలిపారు. ‘400 చదరపు కిలోమీటర్ల పరిధిలో 122 వస్తువులు ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక మీటరు నుంచి 23 మీటర్ల సైజులో ఉంది.

కొన్ని ప్రకాశవంతంగా కనిపిస్తుడడంతో అవి దృఢపదార్థాలతో తయారై ఉండొచ్చని భావిస్తున్నాం. ఇవి ఇదివరకు చైనా, ఆస్ట్రేలియాలు.. శకలాలుగా భావిస్తున్న వస్తువులను గుర్తించిన చోటికి సమీపంలోనే ఉన్నాయి. ఇవి బోయింగ్‌వని భావించొచ్చు. కానీ కచ్చితంగా చెప్పలేం. నిర్ధారణ అయ్యాక తర్వాతి దశ గాలింపు మొదలుపెడతాం’ అని అన్నారు. మరోపక్క.. శకలాల కోసం గాలిస్తున్న విమానాలకు నీలిరంగు వస్తువు సహా మూడు వస్తువులు కనిపించాయి. మలేసియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఈ నెల 8న 239 మందితో కౌలాలంపూర్ నుంచి బీజింగ్ వెళ్తూ గల్లంతవడం, అది దక్షిణ హిందూ మహాసముద్రంలో కూలిపోయిందని మలేసియా ప్రభుత్వం ప్రకటించడం తెలిసిందే. కాగా, మలేసియా ఎయిర్‌లైన్స్, బోయింగ్ కంపెనీలు  కోట్లాది డాలర్ల పరిహారంతో ముడిపడిన దావాలో చిక్కుకున్నాయి. ఈ విమానం డిజైన్, కూలిపోయేందుకు దారి తీసిన లోపాల వివరాలివ్వాలని షికాగోలోని ఒక లా సంస్థ కోర్టులో పిటిషన్ వేసింది.
 

మరిన్ని వార్తలు