‘మా ఎమ్మెల్యే, ఎంపీ కనిపించడం లేదు’

19 May, 2020 15:28 IST|Sakshi

మాజీ సీఎం కమల్‌నాథ్‌, నకుల్‌నాథ్‌ తీరుపై నిరసన

భోపాల్‌: ‘‘మహమ్మారి కరోనా సంక్షోభ సమయంలో కనిపించకుండా పోయిన చింద్వారా ఎమ్మెల్యే, ఎంపీ కోసం స్థానిక ప్రజలు వెదుకులాట ప్రారంభించారు. వాళ్లను చింద్వారాకు తీసుకువచ్చిన వారికి 21,000 క్యాష్‌ రివార్డు ఇస్తాం’’ అంటూ చింద్వారా నియోజకవర్గం ప్రజలు పలుచోట్ల పోస్టర్లు అంటించారు. విపత్కర సమయంలో తమకు అండగా నిలవకుండా బాధ్యతారాహిత్యానికి పాల్పడ్డారంటూ మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌, ఆయన కుమారుడు నకుల్‌నాథ్‌ ఫొటోలను పోస్టర్లపై ముద్రించి నిరసన తెలిపారు. కాగా చింద్వారా శాసన సభ స్థానం నుంచి కమల్‌నాథ్‌ ఎమ్మెల్యేగా గెలుపొందగా.. లోక్‌సభ స్థానం నుంచి ఆయన తనయుడు నకుల్‌నాథ్‌ ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.('కళ్ల ముందే ప్రాణం పోతుంటే ఏం చేయలేకపోయా')

ఈ క్రమంలో లాక్‌డౌన్‌ కారణంగా తాము కష్టాలు పడుతున్నా పట్టించుకోవడం లేదంటూ వీరిద్దరిపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తూ ఇలా పోస్టర్లు వేయించారు. ఇక పోస్టర్లపై స్పందించిన కాంగ్రెస్‌ పార్టీ అధికార బీజేపీ నాయకులే ఈ చర్యకు పాల్పడ్డారంటూ విమర్శలు గుప్పించారు. అయితే బీజేపీ నేతలు ఆ విమర్శలను కొట్టిపారేశారు. ఆ పోస్టర్లతో తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు.  కాగా కాంగ్రెస్‌ పార్టీలో సుదీర్ఘ కాలం కొనసాగిన జ్యోతిరాదిత్యా సింధియా కమల్‌నాథ్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు జెండా ఎగురవేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 21 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడంతో కమల్‌ సర్కారు కూలిపోగా.. ఆయన రాజీనామా అనంతరం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.(మిగిలిన టెన్త్‌ పరీక్షలు రద్దు.. సీఎం‌ కీలక నిర్ణయం) 

>
మరిన్ని వార్తలు