ఆగిన మిథున్‌ చక్రవర్తి కొడుకు పెళ్లి

8 Jul, 2018 02:01 IST|Sakshi
మహాక్షయ్‌

రేప్, మోసం చేశాడని పోలీసులకు యువతి ఫిర్యాదు

తమిళ సినిమా(చెన్నై): బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు మిథున్‌ చక్రవర్తి కుమారుడు మహాక్షయ్‌ వివాహం శనివారం అర్థంతరంగా నిలిచిపోయింది. ఓ యువతిని రేప్, మోసం చేసిన కేసులో కోర్టు ఆదేశాలతో విచారణ కోసం పోలీసులు ఊటీలోని వివాహ వేదిక వద్దకు చేరుకోవడంతో వధువు కుటుంబం అక్కడ్నుంచి వెళ్లిపోయింది. మిథున్‌ చక్రవర్తి కుమారుడు మహాక్షయ్‌ పెళ్లి చేసుకుంటానని నమ్మించి నాలుగేళ్ల పాటు తనతో సహజీవనం చేశాడని బాధితురాలు ఢిల్లీ పోలీసులకు చేసిన ఫిర్యాదులో తెలిపింది.

తాను గర్భం దాల్చడంతో గర్భస్రావమయ్యేలా ఏవో మందులు ఇచ్చాడని వెల్లడించింది. తన కుమారుడ్ని వదిలేయకుంటే తీవ్ర పర్యావసానాలు ఉంటాయని మహాక్షయ్‌ తల్లి యోగితా బాలీ తనను బెదిరించినట్లు వాపోయింది. దీంతో ప్రాణాలు రక్షించుకోవడం కోసం ముంబై నుంచి ఢిల్లీకి పారిపోయివచ్చినట్లు పేర్కొంది. ఈ కేసును విచారించిన ఢిల్లీలోని ఓ కోర్టు నిందితులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసేందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని అభిప్రాయపడింది.

ఈ కేసులో చట్టప్రకారం ముందుకు వెళ్లాలని పోలీసుల్ని ఆదేశించింది. దీంతో ఈ కేసులో తమకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని యోగిత, మహాక్షయ్‌లు ముంబై హైకోర్టును ఆశ్రయించారు. కానీ ఈ విజ్ఞప్తిని తిరస్కరించిన హైకోర్టు.. ఈ వ్యవహారాన్ని ఢిల్లీలోని న్యాయస్థానంలోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో బాధితురాలి ఫిర్యాదుపై మిథున్‌ కుటుంబాన్ని విచారించేందుకు పోలీసులు శనివారం తమిళనాడులోని ఊటీలో ఉన్న వివాహ వేదిక వద్దకు చేరుకున్నారు. దీంతో వధువు కుటుంబం అక్కడ్నుంచి వెళ్లిపోయింది.

మరిన్ని వార్తలు