వారికి ‘ఆధార్‌’ నెంబర్‌ అంటే భయం

28 Mar, 2018 19:39 IST|Sakshi
‘బుక్‌ ఆఫ్‌ రివిలేషన్‌’ ప్రకారం 666 నెంబర్‌ను ‘దెయ్యం’గా క్రైస్తవులు పరిణిస్తారు

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని ప్రతి పౌరుడు ఆధార్‌ కార్డును తీసుకోవాలని భారత ప్రభుత్వం గత కొన్నేళ్లుగా ఒత్తిడి చేస్తున్నా, అన్ని ప్రభుత్వ స్కీమ్‌లకు తప్పనిసరంటున్నా మిజోరమ్‌లో కొంత మంది ప్రజలు మాత్రం ఇప్పటికీ ఆధార్‌ కార్డును తీసుకోవాలంటే భయపడుతున్నారు. అందుకు కారణం వారి మత విశ్వాసమే. మిజోరమ్‌లో 87 శాతం మంది క్రైస్తవులే ఉన్నారు. బైబిల్‌ చివరి పుస్తకంగా పరిగణించే ‘బుక్‌ ఆఫ్‌ రివిలేషన్‌’ ప్రకారం 666 నెంబర్‌ను ‘దెయ్యం’గా క్రైస్తవులు పరిణిస్తారు. ఈ దెయ్యాన్ని ‘ఎక్సాకోసియో ఇయెక్సెకోంటాహెక్సా ఫోబియా’ అనే పదంతో కూడా సూచిస్తారు.

ఆధార్‌ కార్డు నెంబర్లలో 666 నెంబర్‌ కూడా ఉంటది కనుక, అది దెయ్యం కింద లెక్కేనని, అందుకని తాము ఆధార్‌ కార్డునే స్వీకరించమని కొందరు ఇప్పటికీ వాదిస్తున్నారు. రాష్ట్రంలో 400 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఏకమై ఆధార్‌ కార్డుకు వ్యతిరేకంగా ఆందోళన కూడా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఎంత ఒత్తిడి తెచ్చినా తాను మాత్రం ఆధార్‌ కార్డు నెంబర్‌ను తీసుకోబోనని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్థుల సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న ఓ టీచర్‌ లాల్జియారానా ప్రకటించారు. మత స్వేచ్ఛను కలిగి ఉండే హక్కు రాజ్యాంగపరంగా తమకు ఉంది కనుక మత విశ్వాసం ప్రకారం ఆధార్‌ కార్డును తిరస్కరించే హక్కు కూడా తమకు ఉందంటూ కొందరు సుప్రీం కోర్టుకు కూడా వెళ్లారు.

ఆధార్‌ కార్డుకు దెయ్యానికి సంబంధం లేదని, అయినా దేవుడిని ఆరాధించే ప్రజల వద్దకు దెయ్యం రాదంటూ రాష్ట్రంలోని దాదాపు అన్ని చర్చిలు స్పష్టం చేశాక ఎక్కువ మంది క్రైస్తవులు ఆధార్‌ కార్డులను నమోదు చేయించుకున్నారు. అయినప్పటికీ మార్చి 15వ తేదీ వరకు ఆధార్‌ కార్డుల నమోదు రాష్ట్రంలో 81 శాతం వరకు చేరుకుంది. అంటే, ఇంకా 19 శాతం మంది తీసుకోలేదు.

మరిన్ని వార్తలు