కులాంతర వివాహాల్లో మిజోరం ఫస్ట్

14 May, 2016 14:55 IST|Sakshi
కులాంతర వివాహాల్లో మిజోరం ఫస్ట్

న్యూఢిల్లీ: భారతదేశంలో కులాంతర వివాహాలను అనుమతిస్తూ 50 ఏళ్ల క్రితమే చట్టం తీసుకొచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో కులాంతర వివాహాలు జరగడం లేదు. దేశవ్యాప్తంగా 95 శాతం మంది ఇప్పుటికీ అదే కులం వారిని పెళ్లి చేసుకుంటున్నారు. ఆశ్చర్యంగా 87శాతం మంది క్రైస్తవులుగల మిజోరంలో 55 శాతం మంది కులాంతర వివాహాలు చేసుకుంటున్నారు. ఆ తర్వాత మేఘాలయలో 46 శాతం, సిక్కింలో 37 శాతం మంది కులాంతర వివాహాలను చేసుకుంటున్నారు. ఆ తర్వాత కాశ్మీర్‌లో 35 శాతం మంది, గుజరాత్‌లో 13 శాతం మంది కులాంతర వివాహాలను చేసుకుంటున్నారు.

ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందిన వారు కులాంతర వివాహాలు ఎక్కువగా  చేసుకుంటారంటూ ఇంతకాలం మనం భావిస్తున్న దృక్పథం తప్పని ఈ గణాంకాలతో స్పష్టమవుతోంది. వివిధ సర్వేలు వెల్లడించిన ఈ గణాంకాలను మేరీలాండ్ యూనివర్శిటీ క్రోడీకరించి ఈ అంశాలను తెలియజేసింది. ఒకే కులం మధ్య జరుగుతున్న పెళ్లిళ్లలో దేశంలోనే మధ్య ప్రదేశ్ ముందుంది. ఆ రాష్ట్రంలో 99 శాతం మంది అదే కులం వారిని పెళ్లి చేసుకుంటున్నారు. ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్‌లో, చత్తీస్‌గఢ్, గోవా రాష్ట్రాల్లో 98 శాతం మంది, పంజాబ్‌లో 97 శాతం మంది అదే కులస్థులను పెళ్లి చేసుకుంటున్నారు.

కులాంతర వివాహాలను అనుమతిస్తూ దేశంలో చట్టం తీసుకొచ్చినప్పుడు ఒకే కులం మధ్య పెళ్లిళ్లు 98 శాతం ఉండగా, ఇప్పుడది 95 శాతానికి పడిపోయింది. కులాంతర వివాహాలు వేగం పుంజుకోనప్పటికీ కొత్త పురోగతి మాత్రం ఉందని సామాజిక శాస్త్రవేత్తలు అంటున్నారు.

మరిన్ని వార్తలు