ఆట మధ్యలో బిడ్డకు చనుబాలు పట్టిన ప్లేయర్‌

10 Dec, 2019 15:57 IST|Sakshi

చంటిబిడ్డ ఆకలి తల్లికే తెలుస్తుంది.. అందుకే తన ఏ చోట ఉన్నా.. బిడ్డ ఆకలిని తీర్చేందుకు తల్లి వెనుకాడదు. అమృతం వంటి చనుబాలు అందించి తనను లాలిస్తుంది. మిజోరాంకు చెందిన లాల్వేంట్లుంగాని కూడా అలాంటి తల్లే. అందుకే వాలీబాల్‌ ఆటల పోటీ మధ్యలో కాస్త విరామం దొరకగానే తన పాపాయికి పాలుపట్టి మాతృత్వాన్ని చాటుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోను నింగ్లిన్‌ హంగల్‌ అనే నెటిజన్‌ ఫేస్‌బుక్‌లో షేర్‌ చేశారు. ‘ ఆట మధ్యలో తన ఏడు నెలల బుజ్జాయి ఆకలి తీర్చేందుకు ఓ తల్లి పాలుపట్టిన క్షణం. ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆట పట్ల ఆ తల్లి అంకిత భావాన్ని... నలుగురిలో బిడ్డకు పాలు పట్టిన ధైర్యాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. క్రీడాకారిణిగా, ఓ తల్లిగా రెండు బాధ్యతలు ఒకేసారి నిర్వహించిన ఆమెకు జేజేలు పలుకుతున్నారు’ అని నింగ్లిన్‌ పేర్కొన్నారు. 

ఈ క్రమంలో లాల్వేంట్లుంగాని ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీంతో.. ‘ఆ అమ్మకు సలాం’ అంటూ నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు. కాగా లాల్వేంట్లుంగాని మిజోరాంకు చెందిన వాలీబాల్‌ క్రీడాకారిణి. టికుమ్‌ నియోజకవర్గానికి చెందిన వాలీబాల్ జట్టు సభ్యురాలిగా ఉన్న ఆమె రాష్ట్ర స్థాయిలో క్రీడల్లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఐజ్వాల్‌లో జరిగిన పోటీల్లో ఆమె ఈ విధంగా బిడ్డకు పాలుపట్టారు. ఇక ఈ ఫొటో మిజోరాం క్రీడాశాఖ మంత్రి రాబర్ట్‌ రోమావియా రోటే దృష్టికి రావడంతో ఆయన లాల్వేపై ప్రశంసలు కురిపించారు. ఆమెకు రూ. 10 వేలు బహుమానంగా ప్రకటించారు.

మరిన్ని వార్తలు