ఎంజె అక్బర్‌ కేసులో గెలుపెవరిది?

16 Oct, 2018 15:49 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రంలోని విదేశాంగ శాఖ సహాయ మంత్రి, మాజీ సీనియర్‌ జర్నలిస్ట్‌ ఎంజె అక్బర్‌ సోమవారం నాడు ప్రియా రమణిపై నేరపూరిత పరువు నష్టం దావా వేసిన విషయం తెల్సిందే. అందులో ఆయన తన తరపున వాదించడానికి 30 మంది మహిళలు సహా 97 మంది న్యాయవాదులను పేరు పేరున పేర్కొనడం గమనార్హం. అక్బర్‌పై లైంగిక ఆరోపణలు చేసిన 14 మంది మహిళల్లో ప్రియా రమణి మొదటి వారు. 2017, అక్టోబర్‌ నెలలో ‘వోగ్‌ ఇండియా’లో ఓ ఎడిటర్‌ నీచ ప్రవర్తన గురించి ప్రియా రమణి ఓ ఆర్టికల్‌ రాశారు. అయితే ఆ వ్యాసంలో ఆమె ఆ ఎడిటర్‌ పేరును ప్రస్తావించలేదు. ఏడాది అనంతరం అక్టోబర్‌ 8వ తేదీన ఆ ఎడిటరే ఎంజె అక్బర్‌ అంటూ ట్వీట్‌ చేశారు. దాంతో మరో 13 మంది మహిళా జర్నలిస్టులు బయటకు వచ్చి తాము కూడా అక్బర్‌ లైంగిక వేధింపులకు గురయ్యామని ఆరోపించడం తెల్సిందే.

అప్పుడప్పుడు మీడియాను వేధించేందుకు రాజకీయ నాయకులు పరువు నష్టం దావాలు వేయడం మామూలే. ఇప్పుడు తనపై వచ్చిన ఆరోపణలకు అక్బర్‌ ఏకంగా నేరపూరిత పరువు నష్టం దావా వేశారు. దీని కింద దోషికి జరిమానా లేదా రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా రెండూ విధించవచ్చు. అక్బర్‌ తన పిటిషన్‌లో ప్రధానంగా రెండు అంశాలను ప్రస్తావించారు. ఒకటి సమాజంలో తన పరువు, ప్రతిష్టను దెబ్బతీయడానికి నిరాధార ఆరోపణలు చేశారని, దీని వెనక రాజకీయ కోణం ఉందన్నది. రెండోది 20 ఏళ్ల క్రితం నిజంగా లైంగిక వేధింపులు జరిగి ఉంటే ఇంతకాలం ఎందుకు ఫిర్యాదు చేయలేదన్నది. ‘మీటూ’ ఉద్యమంలో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మగవాళ్లందరు కూడా ఎప్పుడో జరిగిన దాని గురించి ఇప్పటి వరకు ఎందుకు ఫిర్యాదు చేయలేదన్న అంశాన్నే నొక్కి ప్రశ్నిస్తున్నారు.

ఈ ప్రశ్నకు అక్బర్‌ పెట్టుకున్న 97 మంది న్యాయవాదులకన్నా ఎక్కువ మంది న్యాయవాదులు సమాధానం చెప్పగలరు. ఇందులో ముడివడి ఉన్న మొట్టమొదటి అంశం ‘పవర్‌ ఈక్వేషన్‌’. అంటే, ఎవరి అధికారం ఎక్కువ, ఎవరిది తక్కువన్నది. సహజంగా బాధితుల అధికారమే తక్కువుంటుంది. వేధింపుల గురించి ఫిర్యాదు చేస్తే కక్ష సాధింపు చర్యలు ఉంటాయన్న భయం, వ్యక్తిగత, వృత్తి జీవితాలకు ఎక్కడ ముప్పు వాటిల్లుతుందన్న ఆందళన వారిని వెంటాడుతోంది. అందుకనే వారు ఫిర్యాదు చేయడానికి సాహసించలేరు.

ఎందుకు కేసు పెట్టరంటే.....

ఫిర్యాదు చేయాలన్నా అప్పటికి ‘సెక్సువల్‌ హరాస్‌మెంట్‌ ఆఫ్‌ విమెన్‌ ఎట్‌ వర్క్‌ ప్లేస్‌ (ప్రివెన్షన్, ప్రొహిబిషన్, రిడ్రెసల్‌) యాక్ట్‌’ లేదు. దీన్ని యూపీఏ ప్రభుత్వం 2013లో తీసుకొచ్చింది. ఈ చట్టం రాకముందు లైంగిక వేధింపుల గురించి ఫిర్యాదు చే యాలంటే పోలీసుల వద్దకు వెళ్లడం ఒక్కటే మార్గం. సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులపై ఫిర్యాదు చేయాలంటే ఎంతో ఒత్తిడి గురికావాల్సి వస్తుంది. వ్యక్తిగత పరువు, ప్రతిష్టలు దెబ్బతీస్తారన్న భయం ఉంటుంది. ఫిర్యాదు చేసిన పెద్దవారిపై చర్యలు తీసుకుంటారన్న నమ్మకం ఉండదు. పలుకుబడిగల వ్యక్తులపై ఫిర్యాదు కోసం పోలీసు స్టేషన్‌కు వెళితే ఫిర్యాదును తిరస్కరించిన ఉదంతాలను ఇప్పటికీ వింటుంటాం. పైగా చట్టానికూడా పరిమితులు ఉన్నాయి. ఫలానా కేసుకు ఫలానా కాల పరిమితిలోగా ఫిర్యాదులు చేయాలన్న నిబంధనలు ఉన్నాయి. లైంగిక వేధింపుల కేసే తీసుకుంటే సంఘటన జరిగిన నాటి నుంచి మూడేళ్లలోపే ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. జరిగిన సంఘటన నుంచి తేరుకొని, పోరాడే మనస్తత్వాన్ని సంతరించుకొని, ఫిర్యాదు దాఖలుచేసే ధైర్యాన్ని కూడదీసుకునే వరకే ఈ మూడేళ్ల సమయం గడచిపోవచ్చు.

కేసు పెట్టక పోవడం కూడా హక్కే!

కేసు దాఖలు చేయడానికి కాల పరిమితి ముగిసి పోయినందున తనపై కేసు కొట్టివేయాలన్నది కూడా అక్బర్‌ పిటిషన్‌లో ఓ వాదన. కేసు కొట్టివేస్తే ఆయన నిర్దోషన్నమాట. ఇదంతా తప్పుడు వాదనే అవుతుంది. కేసు పెట్టడం, పెట్టకపోవడమన్నది బాధితురాలి ఇష్టమే కాదు, ఆమె హక్కు కూడా. ఆమె జరిగిన సంఘటన గురించి కేసు దాఖలు చేయలేదు కనుక ఆ సంఘటన గురించి ఆమెకు వెల్లడించే హక్కు లేదంటే ఎలా? నేరాన్ని రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్‌ విఫలమైనప్పుడు నేరస్థుడు విడుదలవుతాడు, అలాంటప్పుడు తనకు జరిగిన అన్యాయం గురించి బాధితుడు లేదా బాధితరాలు మాట్లాడకూడదంటే ఎట్లా! జరిగిన సంఘటన నిజమైనప్పుడు పరువు నష్టం దావాను శంకించాల్సిందే!

గెలుపోటములు

అంతిమంగా ప్రియా రమణి లైంగిక ఆరోపణలు నిజమవుతాయా, ఎంజె అక్బర్‌ పరువు నష్టం దావా నెగ్గుతుందా? అన్నది ప్రశ్న. ఏ కేసులోనైనా సరే నిజా నిజాలు తేల్చాలంటే చట్ట ప్రకారం అందుకు తగిన ఆధారాలు ఉండాల్సిందే. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనకు సంబంధించిన ఆధారాలు ఆమె చూపించలేకపోవచ్చు. పైగా సకాలంలో ఫిర్యాదు చేయలేదు.  అక్బర్‌ నమ్ముతున్నది కూడా ఇదే. ఆ తర్వాత ఏకంగా 13 మంది మహిళలు ఆయనపై ఆరోపణలు చేయడం చిన్న విషయమేమీ కాదు. వారు కూడా కోర్టు వర కు వచ్చి సాక్ష్యాలిస్తే కేసు బలపడుతుంది. మొట్టమొదటి సారిగా తన పేరు బయటపెట్టి పరువు తీసిందన్న అక్కసుతోపాటు ఇంకెవరు తనకు వ్యతిరేకంగా బయటకు రావద్దనే ఉద్దేశంతో అక్బర్‌ పరువు నష్టం దావా వేసినట్లు కనిపిస్తోంది. ఆయన పరువు నష్టం దావాను కూడా ఆయనే నిరూపించుకోవాలి కనుక అది నిలబడే అవకాశం లేదు. దేశంలోని వివిధ రాష్ట్రాలు, వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలు, అందులోనూ జర్నలిస్టులు రాజకీయంగా తనను దెబ్బతీయడానికి కుట్రపన్నారని నిరూపించడం అంత సాధ్యమయ్యే పనేమీ కాదు.

>
మరిన్ని వార్తలు