‘మీ టూ’కు తొలి వికెట్‌

18 Oct, 2018 02:42 IST|Sakshi

లైంగిక వేధింపుల ఆరోపణలపై మంత్రి ఎంజే అక్బర్‌ రాజీనామా

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్‌ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. రాజకీయాల్లోకి రాక ముందు వేర్వేరు మీడియా సంస్థల్లో ఎడిటర్‌గా పనిచేస్తున్న సమయంలో ఆయన లైంగికంగా వేధించారని పలువురు మహిళా జర్నలిస్టులు ఆరోపించడం తెల్సిందే. అక్బర్‌ రాజీనామాను ప్రధాని మోదీ, ఆ తర్వాత రాష్ట్రపతి కోవింద్‌ ఆమోదించారు. అక్బర్‌ రాజీనామా ‘మీటూ’ ఉద్యమ విజయమని మహిళా కార్యకర్తలు అభివర్ణించారు. తాజా పరిణామంలో సత్యం గెలిచిందని కాంగ్రెస్‌ వ్యాఖ్యానించింది. 20 ఏళ్ల కిత్రం తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించిన మహిళా జర్నలిస్టు ప్రియా రమణిపై అక్బర్‌ దాఖలుచేసిన పరువు నష్టం దావాపై ఢిల్లీలోని పాటియాలా కోర్టులో గురువారం విచారణ ప్రారంభంకానుంది.

వ్యక్తిగతంగానే పోరాడుతా..
వ్యక్తిగతంగానే కోర్టులో న్యాయ పోరాటం చేస్తానని అక్బర్‌ అన్నారు. ‘పదవికి రాజీనామా చేసి నాపై వచ్చిన ఆరోపణల్ని వ్యక్తిగతంగానే కోర్టులో సవాలుచేయడం సరైనదని భావించి రాజీనామా చేశా’ అని అన్నారు.

దోవల్‌ను కలిశాకే నిర్ణయం..
ప్రధానికి సన్నిహితుడిగా పేరొందిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌తో సమావేశమయ్యాకే అక్బర్‌ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. అక్బర్‌పై ఆరోపణలు చేస్తున్న మహిళల సంఖ్య ఇప్పటికే 20దాటిందని, మరింత మంది ప్రియా రమణికి మద్దతుగా నిలబడే అవకాశాలున్నాయని నిఘా నివేదికలొచ్చాయని అక్బర్‌కు దోవల్‌ తెలిపారు. అక్బర్‌ వేధింపులకు పాల్పడిన వీడియోలూ బయటికొచ్చే చాన్సుందని తెలుస్తోంది. 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్బర్‌పై∙ఆరోపణలు పార్టీకి నష్టంతెస్తాయని పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో ప్రధాని సూచనతో అక్బర్‌ రాజీనామా చేసినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు