అన్నీ అబద్ధాలు.. నిరాధారాలు

15 Oct, 2018 01:42 IST|Sakshi
ఆదివారం ఢిల్లీలోని తన నివాసంలో కేంద్ర మంత్రి ఎంజే అక్బర్‌

చట్టపరంగా చర్యలు తీసుకోబోతున్నాను

ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే ఈ అసత్య ఆరోపణలు

తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై కేంద్రమంత్రి ఎంజే అక్బర్‌

న్యూఢిల్లీ: జర్నలిస్ట్‌గా ఉన్న సమయంలో సహచర మహిళా పాత్రికేయులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలపై కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్‌ స్పందించారు. వారు తనపై చేసిన ఆరోపణలన్నీ అసత్యాలని, అర్థరహితాలని, అవి తనను అమితంగా బాధించాయని ఆయన పేర్కొన్నారు. విదేశాల్లో అధికారిక పర్యటనలో ఉన్నందువల్లనే ఇప్పటివరకు దీనిపై స్పందించలేదన్నారు. ఆఫ్రికా దేశాల పర్యటన నుంచి తిరిగొచ్చిన కాసేపటికే ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నిరాధార ఆరోపణల కారణంగా తాను కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయబోనని తేల్చి చెప్పారు. తనపై అసత్య ఆరోపణలు చేసినవారిపై చట్టపరంగా చర్యలు తీసుకోబోతున్నానని వెల్లడించారు.

త్వరలో సాధారణ ఎన్నికలు జరగబోతున్న కారణంగా, తన ప్రతిష్ట దెబ్బతీసేందుకే ఇలాంటివన్నీ తెరపైకి వస్తున్నాయన్నారు. ’ఎన్నికలు కొన్ని నెలలు మాత్రమే ఉన్న సమయంలో ఈ తుపాను ఎందుకు వచ్చింది?’ అని ప్రశ్నించారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం ఇప్పుడు వైరల్‌ జ్వరంగా మారిందని అక్బర్‌ వ్యాఖ్యానించారు. లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా హాలీవుడ్‌లో ప్రారంభమైన ‘మీ టూ’ ఉద్యమం భారత్‌లోనూ ఉవ్వెత్తున సాగుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఎంజే అక్బర్‌ జర్నలిస్ట్‌గా ఉన్న సమయంలో వివిధ సమయాల్లో ఆయనతో పాటు జర్నలిస్ట్‌గా పనిచేసిన 11 మంది మహిళలు ఇటీవల ముందుకువచ్చి.. తమపై అక్బర్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు.

వారిలో ప్రియా రమణి, గజాలా వాహెబ్, షుమ రాహ, అంజు భారతి, శుతుపా పాల్‌ల ఆరోపణలపై అక్బర్‌ స్పందించారు. ‘ప్రియా రమణి ఏడాది క్రితం ఓ మ్యాగజీన్‌లో రాసిన ఓ కథనం ద్వారా ఈ దుష్ప్రచారాన్ని ప్రారంభించారు. అందులో నా పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. ఎందుకంటే అది అసత్య కథనమని ఆమెకూ తెలుసు. ఇటీవల ఈ విషయమై అడిగిన ప్రశ్నకు ఆమె.. ఆయన ఏమీ చేయలేదు కాబట్టే, పేరు ప్రస్తావించలేదని సమాధానమిచ్చారు. నేను తనపై చేయి ఎప్పుడూ వేయలేదని శుతుపా పాల్‌ చెబ్తున్నారు. నిజానికి నేనేం చేయలేదని షుమ అంటున్నారు. స్విమింగ్‌ పూల్‌లో పార్టీ చేసుకున్నామని అంజు భారతి ఆరోపించారు. కానీ నాకు ఈతే రాదు. రమణి, వాహెబ్‌లు వారు పేర్కొన్న లైంగిక వేధింపుల ఘటన తరువాత కూడా నాతో కలిసి పనిచేశారు. దీన్ని బట్టి ఇవన్నీ అసత్యాలని తెలియడం లేదా?’ అని అక్బర్‌ వివరణ ఇచ్చారు.
 

ప్రధాని స్పందించాలి: కాంగ్రెస్‌
మంత్రి ప్రకటనకు కొద్ది సేపటి ముందు కాంగ్రెస్‌ నేత ఆనంద్‌ శర్మ విలేకరులతో మాట్లాడుతూ.. సహచర మంత్రిపై లైంగిక వేధింపుల ఆరోపణలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. ‘ఈ విషయంలో ప్రధాని మోదీ స్పందించాలి. ప్రధాని ఎలాంటి వారనేది ప్రజలే నిర్ణయిస్తారు. ఈ అంశం ప్రభుత్వ నైతికతకు సంబంధించిందే కాదు, ప్రధానికీ, ఆయన పదవీ గౌరవానికి సంబంధించింది కూడా’ అని అన్నారు.
 

మరిన్ని వార్తలు