ఆరో తరగతిలో ప్రశ్న.. దళితులంటే ఎవరు..?

7 Sep, 2019 20:22 IST|Sakshi

చెన్నై : ‘సీబీఎస్‌ఈ ఆధ్యర్యంలో నడిచే కేంద్రీయ విద్యాలయలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. దళితులు, ముస్లింల మనోభావాలను కించపరిచే విధంగా ఆరో తరగతి పరీక్ష పత్రంలో ప్రశ్నలు పొందుపరిచారు. తమిళనాడులోని ఓ కేంద్రీయ విద్యాలయ నిర్వహించిన పరీక్షలో దారుణమైన ప్రశ్నలడిగారు’అని డీఎంకే చీఫ్‌ ఎంకే స్టాలిన్‌ ఆరోపించారు. సీబీఎస్‌ఈ ఆరో తరగతి ప్రశ్నాపత్రమని పేర్కొంటూ శనివారం ఆయన ఓ ట్వీట్‌ చేశారు. బాధ్యులైన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ ట్వీట్‌ వైరల్‌ అయింది.

స్టాలిన్‌ ట్వీట్‌ ప్రకారం.. దళితులంటే ఎవరు..? అనే ప్రశ్నకు.. ఎ)విదేశీయులు, బి)అంటరానివారు, సి)మద్య తరగతివారు, డి)ఎగువ తరగతివారు అని ఆప్షన్లు ఇచ్చారు. ఇక మరో ప్రశ్న.. ముస్లింలకు సంబంధించిన ఈ క్రింది సాధారణాంశమేది..? అనే ప్రశ్నకు ఎ)ముస్లింలు బాలికలను పాఠశాలకు పంపరు. బి)వారు ప్యూర్‌ వెజిటేరియన్‌, సి)వారు రోజా సమయంలో నిద్రపోరు, డి)పైవన్నీ.. అని ఆప్షన్లు ఇచ్చారు. ఆరో తరగతి సాంఘీకశాస్త్రంలోని పాఠ్యాంశం ఆధారంగా ఈ ప్రశ్నలు రూపొందించినట్టు చెప్పారు. దీంతో సీబీఎస్‌ఈ పనితీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇక ఈ వ్యవహారంపై ఏఎంఎంకే చీఫ్‌ టీటీవీ దినకరణ్‌, రాజ్యసభ ఎంపీ వైకో కూడా విమర్శలు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. చిన్నారుల మెదళ్లలో విషాన్ని నింపుతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, స్టాలిన్‌ పోస్టు చేసిన ప్రశ్నాపత్రం అధికారికమైనదేనా అనే సందేహాలు నెలకొన్నాయి. ఇక చెన్నైలోని కేంద్రీయ విద్యాలయ సిబ్బంది ఈ ఆరోపణల్ని ఖండించారు. అలాంటి ప్రశ్నలేవీ అగడలేదని కొట్టిపడేశారు.

మరిన్ని వార్తలు