రాష్ట్రపతి వద్దకు తమిళ రాజకీయాలు!

23 Feb, 2017 11:38 IST|Sakshi
రాష్ట్రపతి వద్దకు తమిళ రాజకీయాలు!

చెన్నై: అసెంబ్లీలో బలపరీక్ష సందర్భంగా జరిగిన పరిణామాలపై తమిళనాడులో రాజకీయ వేడి ఇంకా కొనసాగుతోంది. తమిళ రాజకీయాలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వద్దకు వెళ్లనున్నాయి. డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.కే స్టాలిన్ పార్టీ నేతలతో ఢిల్లీకి పయనమయ్యారు. ఇప్పటికే గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావును కలిసి బలపరీక్ష సమయంలో తమపై వ్యవహరించిన తీరును వివరించిన స్టాలిన్.. నేటి సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని కలుసుకుని ఇటీవల అసెంబ్లీలో సీఎం పళనిస్వామి విశ్వాసపరీక్ష సందర్భంగా తలెత్తిన పరిస్థితులను వివరించనున్నారు.

ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు లేకుండానే సభను సజావుగా సాగిస్తూ కేవలం అన్నాడీఎంకే నేతలతోనే స్పీకర్ విశ్వాసపరీక్ష నిర్వహించడంపై రాష్ట్రపతికి స్టాలిన్ ఫిర్యాదు చేయనున్నారు. విశ్వాసపరీక్షను నిరసిస్తూ చెన్నైలో స్టాలిన్ బుధవారం ఒకరోజు నిరాహార దీక్ష చేశారు. అసెంబ్లీ స్పీకర్ ధన్‌పాల్‌ తీరును స్టాలిన్ సహా డీఎంకే ఎమ్మెల్యేలు తప్పుపడుతున్నారు. జయలలిత మృతి చెందిన తీరుపై సరైన రీతిలో విచారణ జరిపితే.. ఇప్పుడు నాలుగేళ్ల జైలుశిక్ష మాత్రమే అనుభవిస్తున్న శశికళకు జీవిత ఖైదు పడొచ్చని స్టాలిన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

మరోవైపు బలపరీక్ష చెల్లదంటూ ప్రధాన ప్రతిపక్షం డీఎంకే దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన మద్రాస్‌ హైకోర్టు తన తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. బలపరీక్ష సందర్భంగా అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలకు సంబంధించిన వీడియో దృశ్యాలను ఆధారాలుగా సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.

మరిన్ని వార్తలు