లైవ్ వీడియోతో సస్పెండైన ఎమ్మెల్యే

6 Feb, 2017 15:10 IST|Sakshi
లైవ్ వీడియోతో సస్పెండైన ఎమ్మెల్యే

గౌహతి : సోషల్ మీడియాలో అభిమానులకు అసెంబ్లీలో తన ప్రసంగాన్ని లైవ్లో చూపించాలనుకున్న ఓ ఎమ్మెల్యే చివరకు మూడు రోజులపాటూ సస్పెండ్ అయ్యారు. ఈ సంఘటన అసోంలోని శాసనసభలో చోటుచేసుకుంది.

ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే అమినుల్ ఇస్లాం ఫిబ్రవరి3న అసెంబ్లీలో అక్రమ వలసల సమస్యపై ప్రసంగిస్తుండగా ఫేస్ బుక్లో తన స్పీచ్ను లైవ్లో పెట్టారు. దీనిపై ఇతర సభ్యలు నుంచి స్పీకర్కు ఫిర్యాదులు అందాయి. వారు వీడియో ఫూటేజీని కూడా తమ ఫిర్యాదుతో జత చేశారు. దీంతో వెంటనే ఎథిక్స్ కమిటీని విచారణ చేపట్టి సోమవారం నివేదిక సమర్పించాలని అసోం అసెంబ్లీ స్పీకర్ హితేంద్రనాత్ గోస్వామి ఆదేశించారు.

ఇలా చేయడం సభా నియమాలను ఉల్లంగించడమే అవుతుందని, ప్రస్తుత సభ నుంచి అమినుల్ను కొద్ది రోజులపాటూ సస్పెండ్ చేయాలని ఎథిక్స్ కమిటీ తన నివేధికలో పేర్కొంది. కమిటీ సిఫార్సులను ఆమెదించి మూడు రోజులపాటూ అమినుల్ను సస్పెండ్ చేసినట్టు స్పీకర్ తెలిపారు. 'తన తప్పుపై రాతపూర్వకంగా అమినుల్ క్షమాపణ కోరారు. ఇది అంత చిన్న తప్పు కాదు. అమినుల్ ఓ సీనియర్ సభ్యులు, ఆయన ఇలా చేస్తారని అనుకోలేదు' అని స్పీకర్ పేర్కొన్నారు. ఏఐయూడీఎఫ్ సభ్యుల ఎదుటే అమినుల్ను ఫిబ్రవరి 8 వరకు స్పెండ్ చేసినట్టు స్పీకర్ తెలిపారు.

స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని ఆహ్వానిస్తూనే..అసెంబ్లీ కార్యకలాపాలు మొత్తం లైవ్ టెలికాస్ట్ చేయాలని అమినుల్ డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం మనం సభలో ఏం చేస్తున్నామో ప్రజలు చూడాలని కోరుకుంటున్నారని ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు