నాసిక్ మేయర్ పదవి ఎమ్మెన్నెస్ పరం

12 Sep, 2014 23:17 IST|Sakshi

నాసిక్: ప్రతిష్టాత్మకంగా మారిన నాసిక్ మేయర్ పదవిని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎమ్మెన్నెస్) కైవశం చేసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి అశోక్ దేవరామ్ ముర్తాదక్ మేయర్‌గా ఎన్నికయ్యాడు. నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్(ఎన్‌ఎంసీ) మేయర్ పదవికి జరిగిన పోలింగ్‌లో అశోక్‌కు 77 ఓట్లు పోలవ్వగా, శివసేనకు చెందిన సుధాకర్ భికా బద్గూజర్‌కు 44 ఓట్లు వచ్చాయని జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి విలాస్ పాటిల్ తెలిపారు.   స్వతంత్ర అభ్యర్థి గురుమిత్ అర్జున్‌సింగ్ బగ్గాను డిప్యూటీ మేయర్‌గా ప్రకటించారు. అతడికి 75 ఓట్లు పోలవ్వగా, బీజేపీకి చెందిన ప్రత్యర్థి శంభాజీ శ్యామ్‌రావ్ మొరుస్కర్‌కు 43 ఓట్లు పోలయ్యాయని పాటిల్ చెప్పారు. ఇదిలా ఉండగా, 2012లో జరిగిన ఎన్‌ఎంసీ ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ పార్టీ బీజేపీతో కలిసి అధికారాన్ని చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే.

 అప్పుడు ఎమ్మెన్నెస్ నుంచి న్యాయవాది అయిన యతిన్ వాఘ్ మేయర్‌గా ఎన్నికయ్యారు. ఆ రెండు పార్టీల మధ్య ఒప్పందం ప్రకారం మొదటి రెండున్నరేళ్లు ఎమ్మెన్నెస్, తర్వాత విడత బీజేపీ అభ్యర్థి మేయర్ పదవి చేపట్టాలి.అయితే యతిన్ మేయర్‌గా ఉన్న సమయంలో బీజేపీని పూర్తి విశ్వాసంలోకి తీసుకోకపోవడంతో బీజేపీ తన మద్దతును ఉపసంహరించుకుంది. దాంతో ఇప్పుడు ఎన్నికలు అనివార్యమయ్యాయి. కాగా, ఈ ఎన్నికల్లో మేయర్ పదవి కోసం ఎమ్మెన్నెస్‌కు చివరి నిమిషంలో కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి మద్దతు ఇవ్వడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. కాగా, ఎన్‌ఎంసీలో 122 మంది కార్పొరేటర్లు ఉండగా ఎంఎన్‌ఎస్-37, ఎన్‌సీపీ-20, కాంగ్రెస్-14, శివసేన-22, బీజేపీ-15, స్వతంత్రులు-6, జనస్వరాజ్య పార్టీ-2, ఆర్పీఐ-3, సీపీఎం-3 కార్పొరేటర్ స్థానాలను గెలుచుకున్నాయి.

>
మరిన్ని వార్తలు