ఆ సినిమా చూడొద్దని మీరెలా చెబుతారు?

20 Oct, 2016 13:59 IST|Sakshi
ఆ సినిమా చూడొద్దని మీరెలా చెబుతారు?

న్యూఢిల్లీ: సినిమా ధియేటర్లపై దాడులు చేసే హక్కు మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(ఎమ్మెన్నెస్)కు లేదని కేంద్ర మంత్రి బాబూల్ సుప్రియో అన్నారు. ఎమ్మెన్నెస్ రౌడీల పార్టీ అని దుయ్యబట్టారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని మండిపడ్డారు. ప్రేక్షకులు ఏ సినిమా చూడాలో, చూడకూడదో నిర్ణయించే అధికారం ఎమ్మెన్నెస్ లేదని పేర్కొన్నారు. శాంతిభద్రతలకు భంగం కలిగించడం సరికాదన్నారు.

ఉడీలో ఉగ్రవాదుల దాడి జరిగిన తర్వాతే పాకిస్థాన్ నటులను నిషేధించాలన్న డిమాండ్ తెరపైకి వచ్చిందని, ఇప్పుడు విడుదలవుతున్న సినిమాలు భారత్-పాక్ సంబంధాలు సవ్యంగా ఉన్నప్పుడు తీసినవని వివరించారు.

కాగా, నిన్న తనపై దాడి చేసిన తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేయకుండా బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం అవమానకరంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

మరిన్ని వార్తలు