‘మర్యాదగా వెళ్తారా.. గెంటెయ్యమంటారా?’

4 Feb, 2020 10:37 IST|Sakshi

ఎమ్‌ఎన్‌ఎస్‌ పేరిట వెలసిన పోస్టర్లు

ముంబై: బంగ్లాదేశీయులు వెంటనే భారత దేశాన్ని విడిచివెళ్లిపోవాలని.. లేదంటే తామే వెళ్లగొడతామని మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన(ఎమ్‌ఎన్‌ఎస్‌) నాయకులు బెదిరింపులకు దిగారు. ఈ మేరకు.. ‘‘బంగ్లాదేశీయులు మీరు దేశాన్ని విడిచివెళ్లిపోండి. లేదంటే ఎమ్‌ఎన్‌ఎస్‌ స్టైల్లో మేమే గెంటేస్తాం’’అంటూ రాయ్‌గఢ్‌ జిల్లాలో ఎమ్‌ఎన్‌ఎస్‌ పేరిట పోస్టర్లు వెలిశాయి. ఇందులో ఎమ్‌ఎన్‌ఎస్‌ చీఫ్‌ రాజ్‌ ఠాక్రే ఫొటోతో పాటు కొత్తగా రాజకీయాల్లో చేరిన ఆయన కుమారుడు అమిత్‌ ఫొటోను కూడా బ్యానర్‌లో చేర్చారు. కాగా నరేంద్ర మోదీ సర్కారు తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతు తెలుపుతున్నట్లు ఎమ్‌ఎన్‌ఎస్‌ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

అదే విధంగా మహారాష్ట్రలో శివసేన.. కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపథ్యంలో బీజేపీతో కలిసి హిందుత్వ జెండాతో ముందుకు సాగేందుకు పార్టీ నిర్ణయించింది. ఇక పార్టీ జెండాలో సైతం పలు మార్పులు చేసింది. హిందుత్వాన్ని ప్రతిబింబించేలా జెండాను పూర్తిగా కాషాయ రంగులోకి మార్చి... మధ్యలో ఛత్రపతి శివాజీ కాలంనాటి రాజముద్రను చేర్చారు. కాగా ఎమ్‌ఎన్‌ఎస్‌ స్థాపించిన సమయంలో.. పార్టీ జెండాను కాషాయం, నీలం, ఆకుపచ్చ రంగులతో తీర్చిదిద్దారు. ఈ నేపథ్యంలో ఓవైపు రాష్ట్ర వ్యాప్తంగా సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతుండగా... ఎమ్‌ఎన్‌ఎస్‌ ఈ విధమైన పోస్టర్లు వేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా శివసేన నుంచి బయటికొచ్చిన రాజ్‌ ఠాక్రే 2006లో ఎమ్‌ఎన్‌ఎస్‌ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. (శివసేనకు చెక్‌.. బీజేపీతో కలిసిన రాజ్‌ఠాక్రే..!)

మరిన్ని వార్తలు