ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ల ఆధునీకరణ

2 Dec, 2019 04:27 IST|Sakshi

హైదరాబాద్‌ సహా ఆరింటిని అప్‌గ్రేడ్‌ చేయనున్న కేంద్రం

న్యూఢిల్లీ: నేర ఘటనలలో సమర్థవంతమైన దర్యాప్తు జరిపేందుకు వీలుగా  దేశంలోని ఆరు కేంద్ర ఫోరెన్సిక్‌ ప్రయోగశాలలను అప్‌గ్రేడ్‌ చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. చండీగఢ్, హైదరాబాద్, కోల్‌కతా, భోపాల్, పుణే, గువాహటిలలో ఉన్న ఆరు సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీలు (సీఎఫ్‌ఎస్‌ఎల్‌)లను ఆధునీకరించనుంది. ఈ ఆరు సీఎఫ్‌ఎస్‌ఎల్‌ల సామర్థ్యాన్ని పెంచాలని హోం శాఖ నిర్ణయించిందని ఒక అధికారి తెలిపారు.

తీవ్రమైన నేరాలలో మరింత సమర్థవంతమైన, శాస్త్రీయ విధానంలో దర్యాప్తును సులభతరం చేయడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. పరిశోధన కార్యకలాపాలను నిర్వహించడానికి ఇటీవల ఢిల్లీలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ సర్వీసెస్, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బిహేవియరల్‌ సైన్సెస్, గుజరాత్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ యూనివర్సిటీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందన్నారు. దీని ద్వారా విద్యావేత్తలు–అభ్యాసకుల మధ్య భాగస్వామ్యాన్ని పెండడంతోపాటు అత్యాధునిక పరిశోధనలకు దోహదపడుతుందని భావిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు