‘భారత్‌కీ లక్ష్మి’ రాయబారులు సింధు, దీపిక

23 Oct, 2019 03:20 IST|Sakshi

ముంబై: సినీ నటి దీపికా పదుకొనే, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధులను ‘భారత్‌ కీ లక్ష్మి’రాయబారులుగా ప్రధాని మోదీ ప్రకటించారు. వేర్వేరు రంగాల్లో మహిళా సాధికారతకు తోడ్పడిన స్త్రీ మూర్తులను ఈ దీపావళి సందర్భంగా ‘భారత్‌కీ లక్ష్మి’ పేరుతో గౌరవించుకుందామంటూ ఇటీవలి ‘మన్‌కీ బాత్‌’లో ప్రధాని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ప్రధాని ఉద్యమానికి మంగళవారం ట్విట్టర్‌లో వీరిద్దరూ మద్దతు ప్రకటించారు. ‘ఈ దీపావళి సందర్భంగా మన దేశ మహిళలు సాధించిన విజయాలను, అందిస్తున్న సేవలకు గుర్తుగా వేడుక జరుపుకుందాం’అంటూ దీపిక ట్విట్టర్‌లో ఒక వీడియో షేర్‌ చేశారు.

‘ప్రధాని మోదీ జీ ‘భారత్‌ కీ లక్ష్మి’ఉద్యమానికి మద్దతు ప్రకటిస్తున్నా. దీని ద్వారా అసాధారణ భారత మహిళలు సాధించిన అసాధారణ విజయాల వేడుక చేసుకుందాం. మహిళలకు సాధికారత, వారు సాధించిన విజయాలను సగర్వంగా చాటినప్పుడే సమాజాభివృద్ధి సాధ్యం’అని సింధు ట్విట్టర్‌లో అన్నారు. వీరిద్దరి మద్దతుపై ప్రధాని మోదీ స్పందిస్తూ ట్విట్టర్‌లో ఒక వీడియోను షేర్‌ చేశారు. ‘అంకితభావానికి భారత మహిళా శక్తి ప్రతీకలు. మహిళా సాధికారితకు పాటుపడటం మన సంస్కృతిలోనే ఉంది’ అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు