ఎవ్వరినీ వదలను

9 Feb, 2019 01:53 IST|Sakshi

అవినీతిపరులే మోదీ గురించి భయపడుతున్నారు

పశ్చిమబెంగాల్, ఛత్తీస్‌గఢ్‌లో విపక్షాలపై ధ్వజమెత్తిన ప్రధాని 

కోల్‌కతా/ఛురబంధర్‌/రాయ్‌పూర్‌: శారదా చిట్‌ఫంట్‌ కుంభకోణంలో దోషులకు బెంగాల్‌ సీఎం మమత అండగా నిలుస్తున్నారని ప్రధాని మోదీ ఆరోపించారు. ఈ వ్యవహారంలో నేరస్తులతో పాటు వారికి అండగా నిలిచేవారిని  విడిచిపెట్టబోమన్నారు. మా–మాటి–మనుష్‌(కన్నతల్లి–మాతృభూమి–సామాన్యుడు) నినాదంతో అధికారంలోకి వచ్చిన తృణమూల్‌ కాంగ్రెస్‌.. కమ్యూనిస్టుల నుంచి హింసను, వేధింపులను అందిపుచ్చుకుందని విమర్శించారు. బెంగాల్‌లోని జల్‌పాయ్‌గురి జిల్లాలో శుక్రవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మమతా బెనర్జీతో పాటు విపక్షాలతీరును మోదీ తీవ్రంగా తప్పుపట్టారు. 

కమ్యూనిస్ట్‌ పార్ట్‌–2గా మారిపోయారు.. 
‘మహాకూటమి పేరుతో ఏకమవుతున్న రాజకీయ పార్టీలకు సిద్ధాంతపరమైన ఏకాభిప్రాయం, దేశ భవిష్యత్‌ గురించి దార్శనికత లేదు. ఇది మహాకూటమి కాదు.. మహా కల్తీ కూటమి. అవినీతిపరులను కాపాడేందుకు సాక్షాత్తూ ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి(మమతా బెనర్జీ) ధర్నాకు కూర్చోవడాన్ని దేశ చరిత్రలో ఎన్నడూ చూడలేదు. శారదా చిట్‌ఫండ్‌ కుంభకోణం విచారణలో నిర్లక్ష్యం వహించినవారికి మద్దతుగా మమత ఎందుకు ధర్నాకు దిగారో పేదప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఈ కుంభకోణంలో నేరస్తులు కావొచ్చు.. లేదా వారిని కాపాడుతున్నవారు కావొచ్చు.. ఈ కాపలాదారు(చౌకీదార్‌) ఎవ్వరినీ విడిచిపెట్టడు’ అని స్పష్టం చేశారు. వామపక్ష పార్టీల హింసను అందిపుచ్చుకున్న తృణమూల్‌ ప్రభుత్వం ‘కమ్యూనిస్ట్‌ పార్ట్‌–2’గా మారిపోయిందని దుయ్యబట్టారు. 

చొరబాటుదారులైనా ఓకే 
‘బెంగాల్‌ ప్రభుత్వం బీజేపీ నేతల ర్యాలీలను, హెలికాప్టర్ల ల్యాండింగ్‌ను సైతం అడ్డుకుంటోంది. ఇక్కడి ప్రభుత్వం విదేశీ చొరబాటుదారుల్ని అయినా స్వాగతిస్తుందేమో కానీ, స్వామి వివేకానంద సిద్ధాంతాలను అనుసరించే బీజేపీ నేతల ర్యాలీలకు అనుమతి నిరాకరిస్తోంది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వారి పరిస్థితేంటి? 
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌ జిల్లా కొడతరయ్‌లో మరో సభలో ప్రసంగిస్తూ..‘రుణమాఫీ విషయంలో ఛత్తీస్‌ రైతులను కాంగ్రెస్‌ మోసం చేసింది. కాంగ్రెస్‌ సర్కారు కేవలం గ్రామీణ, సహకార బ్యాంకుల్లో రైతులు తీసుకున్న రుణాలనే మాఫీ చేసింది. జాతీయ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న రైతుల పరిస్థితి ఏంటి?’ అని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో ఛత్తీస్‌గఢ్‌ను ఏటీఎంలా వాడుకోవాలని అనుకుంటున్నారు కాబట్టే కాంగ్రెస్‌ ప్రభుత్వం సీబీఐకి సమ్మతి ఉత్తర్వులను ఉపసంహరించుకుందని విమర్శించారు. శుక్రవారం అస్సాంలోని గువాహటికి చేరుకున్న మోదీకి నిరసనల సెగ ఎదురైంది. కేంద్రం తెస్తున్న పౌరసత్వ సవరణ బిల్లును నిరసిస్తూ ఆల్‌ అస్సాం స్టూడెంట్స్‌ యూనియన్‌ సభ్యులు నల్ల జెండాలతో మోదీకి నిరసన తెలిపారు. మోదీ గో బ్యాక్, పౌరసత్వ బిల్లును రద్దుచేయండి, అస్సాం వర్ధిల్లాలి అని నినాదాలతో హోరెత్తించారు.  
 
మిస్టర్‌ మ్యాడీ..! 
బెంగాల్‌ పర్యటనలో భాగంగా మోదీ కలకత్తా హైకోర్టు సర్క్యూట్‌ బెంచ్‌ను జల్‌పాయ్‌గురిలో ఆవిష్కరించారు. కేంద్రం 13–14 ఏళ్ల క్రితమే అనుమతులు ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సర్క్యూట్‌ బెంచ్‌ను ఏర్పాటు చేయలేదని మోదీ విమర్శించారు. ఈ బెంచ్‌వల్ల డార్జిలింగ్, కలింగ్‌పొంగ్, జల్‌పాయ్‌గురి జిల్లాల ప్రజలకు లబ్ధి చేకూరుతుందనీ, వీరందరికీ 100 కి.మీ పరిధిలోనే హైకోర్టు సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. కాగా, సర్క్యూట్‌ బెంచ్‌ ప్రారంభోత్సవం గురించి రాష్ట్ర ప్రభుత్వానికి, హైకోర్టుకు కేంద్రం సమాచారం ఇవ్వలేదని బెంగాల్‌ సీఎం మమత మండిపడ్డారు.

ఇందుకోసం స్థలం కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వమనీ, బెంచ్‌ కలకత్తా హైకోర్టుకు సంబంధించినదని గుర్తుచేశారు. ఈ సందర్భంగా మోదీని మిస్టర్‌ మ్యాడీ(పిచ్చివాడి)గా అభివర్ణించారు. ప్రధాని వ్యవహారశైలి పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు లేకపోయినప్పటికీ బ్యాండ్‌ మేళంవాడు తొందరపడి వచ్చినట్లు ఉంద న్నారు. తమకు ప్రధాని కుర్చీపై గౌరవం ఉందనీ, ఈ వ్యక్తి(మోదీ)పై మాత్రం లేదన్నారు. కోల్‌కతా ధర్నాలో తనతో కలిసి పాల్గొన్న సీనియర్‌ పోలీస్‌ అధికారుల మెడల్స్‌ను కేంద్రం వెనక్కు తీసుకుంటే.. ఆ అధికారులకు రాష్ట్ర అత్యున్నత పురస్కారం ‘బంగ బిభూషణ్‌’ అందజేస్తానని చెప్పారు.
 

మరిన్ని వార్తలు