కరువు కాంగ్రెస్‌ పుణ్యమే : మోదీ

1 Apr, 2019 12:49 IST|Sakshi

వార్ధా : మహారాష్ట్రలో కాంగ్రెస్‌-ఎన్సీపీ సంకీర్ణం అధికారంలో ఉండగా ఇరిగేషన్‌ స్కామ్‌లో కూరుకుపోయి రైతులను మోసం చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. రైతుల సంక్షేమానికి తాము అవిశ్రాంతంగా పనిచేస్తున్నామని చెప్పారు. విదర్భ ప్రాంతంలో కరువుకు కాంగ్రెస్‌ విధానాలే కారణమని విమర్శించారు. వార్ధాలో సోమవారం లోక్‌సభ ఎన్నికల ప్రచార ర్యాలీని ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్‌-ఎన్సీపీ కూటమిపై నిప్పులు చెరిగారు. వారు అధికారంలో ఉండగా కుంభకర్ణుల తరహాలో ఆరునెలల పాటు నిద్రలో ఉండి ప్రజల సమస్యలను విస్మరించారని మండిపడ్డారు.

ఎన్సీపీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోందని, టికెట్ల పంపిణీ సమయంలోనూ ఎవరు ఎక్కడ పోటీలో ఉంటారో వారికే తెలియలేదని ఎద్దేవా చేశారు. దేశ సైనికులను అవమానించిన కాంగ్రెస్‌కు ప్రజలు రానున్న ఎన్నికల్లో గుణపాఠం చెబుతారని అన్నారు. ఇక పది రోజుల్లో ఎన్నికలకు తెరలేస్తుందని, మండుటెండనూ లెక్కచేయకుండా ర్యాలీకి తరలివచ్చిన జనసంద్రాన్ని చూసి కాంగ్రెస్‌-ఎన్సీపీలకు ఈ రాత్రి నిద్ర కరవవుతుందని చురకలు వేశారు.

మరిన్ని వార్తలు