కాంగ్రెస్‌ది ‘ఎమర్జెన్సీ’  మనస్తత్వం..

26 Jun, 2018 14:12 IST|Sakshi

సాక్షి, ముంబై : కాంగ్రెస్‌ అధికార దాహానికి, ఒక కుటుంబ స్వార్ధ ప్రయోజనాల కోసం రాజ్యాంగం దుర్వినియోగమైందని, దేశంలో విపక్ష నేతలందరినీ జైళ్ల పాలు చేశారని ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. 1975లో ఎమర్జెన్సీ విధించి 43 ఏళ్లు అవుతున్న సందర్భంగా బీజేపీ దేశవ్యాప్తంగా బ్లాక్‌ డే పేరుతో నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ముంబైలో మంగళవారం బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తూ కేవలం ఒక కుటుంబ మనుగడ కోసం, అధికారం నిలుపుకునేందుకు దేశం మొత్తాన్ని జైలుగా మారుస్తారని భారత్‌ ఎన్నడూ భావించి ఉండదన్నారు.

ఎమర్జెన్సీ సమయంలో ప్రతి ఒక్కరూ భయంతో బతికారని, పాలకులు రాజ్యాంగాన్ని కాలరాశారని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేనందునే ఆ పార్టీ ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలను అనుసరించదని ఎద్దేవా చేశారు. దేశ చరిత్రలో ఎమర్జెన్సీ మాయని మచ్చని, రాజ్యాంగ పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణకు నడుం బిగించేందుకే బ్లాక్‌ డే నిర్వహిస్తున్నామని చెప్పారు.

కాంగ్రెస్‌ పార్టీ ఉనికిని కోల్పోయిన ప్రతిసారీ దేశం ప్రమాదంలో ఉందని, దళితులు, మైనారిటీలను తామే ఉద్ధరించగలమని గగ్గోలు పెడుతుందని చెప్పుకొచ్చారు. అభిశంసన తీర్మానంతో కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు న్యాయవ్యవస్థనూ భయభ్రాంతులకు గురిచేస్తోందని ఆరోపించారు. ఎమర్జెన్సీ నాటి మనస్తత్వమే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రదర్శిస్తోందని విమర్శించారు.

మరిన్ని వార్తలు