అఖిలపక్ష సమావేశానికి మోదీ పిలుపు

15 Feb, 2019 18:15 IST|Sakshi

తొలిసారి అఖిలపక్ష సమావేశానికి ఎన్డీయే పిలుపు

ఉగ్రదాడికి ఏవిధంగా బదులివ్వాలని చర్చించే అవకాశం

సాక్షి, న్యూఢిల్లీ: సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై ఉగ్రవాదుల దాడిని ప్రపంచ దేశాలు ఖండిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పుల్వామా ఉగ్రదాడికి బదులుచెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ జరిపిన దాడికి ఏవిధంగా బదులివ్వాలన్న అంశంపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అఖిలపక్ష సమావేశానికి పిలిపునిచ్చారు. దేశంలోని ప్రధాన పార్టీల నేతలతో ప్రధాని నేతృత్వంలోని కీలక కమిటీ శనివారం ఉదయం పార్లమెంట్‌ లైబ్రరీలో సమావేశం కానుంది. ఈ సమావేశంలో అన్ని పార్టీల అభిప్రాయాలను కేంద్రం తీసుకోనుంది. జవాన్ల దాడి హేయమైన చర్య అని.. దానిని అందరం ముక్తకంఠంతో ఖండించాలని మోదీ కోరే అవకాశం ఉంది.

కాగా కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలిసారి అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. ఇదివరకు 2016 ఓసారి సమావేశం జరిగినప్పటికీ.. మెరపు దాడుల గురించి వివరించేందుకు మాత్రమే సమావేశమయ్యారు. విపక్షాల అభిప్రాయం కోసం తొలిసారి మోదీ పిలుపునిచ్చారు. పుల్వామా ఉగ్రదాడిని దేశంలో అన్ని పార్టీల నాయకులు ముక్తకంఠంలో ఖండించిన విషయం తెలిసిందే. దాడికి ఖచ్చింతంగా సమాధానం ఇవ్వాల్సిందేనని పలు పార్టీలు ఇదివరకే డిమాండ్‌ చేశాయి.

కాగా ప్రధాని అఖిలపక్ష సమావేశ పిలుపును కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ స్వాగతించారు. ఈ విషయంలో కేంద్రానికి అన్ని విధాలా సహకరిస్తామని ఆయన తెలిపారు. ఇదిలావుండగా ఉగ్రవాద ప్రేరేపిత సంస్థలపై చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్‌ హైకమిషనర్‌కు భారత్‌ ఇదివరకే సమన్లు జారీచేసిన విషయం తెలిసిందే. మోదీ నేతృత్వంలో జరిగిన కేబినేట్ సమావేశంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. పాకిస్థాన్‌ను అత్యంత ప్రాధాన్యత దేశాల జాబితా నుంచి తొలగించినట్లు ప్రకటించారు.

మరిన్ని వార్తలు