లోక్‌పాల్‌కు దరఖాస్తుల ఆహ్వానం

7 Feb, 2019 05:45 IST|Sakshi

చైర్మన్, సభ్యుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం

న్యూఢిల్లీ: సామాజికవేత్త్త అన్నా హజారే దీక్షను విరమించడంతో లోక్‌పాల్‌ నియామక ప్రక్రియను కేంద్రం ప్రారంభించింది. అవినీతి వ్యతిరేక అంబుడ్స్‌మన్‌గా భావించే లోక్‌పాల్‌ చైర్మన్, సభ్యుల పదవులకు దరఖాస్తులు కోరుతూ ప్రకటన జారీ అయింది.

అర్హతలు, నిబంధనలు
► లోక్‌పాల్‌ చైర్మన్‌ పదవికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా లేదా న్యాయమూర్తిగా పనిచేసిన వారు లేదా అవినీతి వ్యతిరేక విధానాలు, ప్రజా పాలన, విజిలెన్స్, బ్యాంకింగ్, ఫైనాన్స్, బీమా, న్యాయ శాస్త్రం, మేనేజ్‌మెంట్‌ తదితర రంగాల్లో కనీసం 25 ఏళ్లు పనిచేసిన అనుభవం ఉన్నవారు అర్హులు.

► 45 ఏళ్లకు తక్కువగా ఉన్నవారు అనర్హులు.

► లోక్‌పాల్‌లో చైర్మన్‌తో పాటు గరిష్టంగా 8 మంది సభ్యులుంటారు. అందులో నలుగురు న్యాయశాస్త్రంలో అనుభవం కలిగి ఉండాలి.

► కనీసం నలుగురికి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలు, మహిళల నుంచి అవకాశం కల్పిస్తారు.

► చైర్మన్, సభ్యుల పదవీకాలం ఐదేళ్లు లేదా వారికి 70 ఏళ్లు వచ్చే వరకు(ఏది ముందైతే అది అమలవుతుంది). ∙చైర్మన్‌ జీతభత్యాలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వేతనాలకు సమానంగా ఉంటాయి. సభ్యులకు సుప్రీంకోర్టు జడ్జితో సమానంగా చెల్లిస్తారు. ∙పదవీ కాలంలో వారు ఎలాంటి ఇతర లాభదాయక పదవులు నిర్వహించరాదు. ఎన్నికల్లో పోటీచేయరాదు. ∙దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీ ఫిబ్రవరి 22.

మరిన్ని వార్తలు