అన్నదానం చేస్తే జీఎస్టీ రిఫండ్‌

3 Jun, 2018 03:04 IST|Sakshi

కేంద్రం కొత్త పథకం ప్రారంభం  

న్యూఢిల్లీ: అన్నదానం చేస్తున్న ఆధ్యాత్మిక, దాతృత్వ సంస్థలపై ఆర్థిక భారం తగ్గించేందుకు కేంద్రం సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ‘సేవా భోజ్‌ యోజన’గా పిలిచే ఈ పథకం ద్వారా ఆ సంస్థలకు కేంద్ర జీఎస్టీ(సీజీఎస్టీ), సమీకృత జీఎస్టీ(ఐజీఎస్టీ) మొత్తాలను తిరిగి చెల్లిస్తారు. రెండేళ్ల పాటు రూ.325 కోట్ల వ్యయంతో సాంస్కృతిక శాఖ ఈ కార్యక్రమాన్ని అమలుచేయనుంది. కనీసం ఐదేళ్లుగా పనిచేస్తూ నెలకు కనీసం 5 వేల మందికి అన్నదానం చేస్తున్న ఆలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలు, ధార్మిక ఆశ్రమాలు, దర్గాలు, మఠాలు తదితరాలకు ఈ పథకం వర్తిస్తుంది.

అర్హమైన సంస్థలు సాంస్కృతిక శాఖ వద్ద నమోదుచేసుకోవాలి. దర్పన్‌ పోర్టల్‌లో సమర్పించే దరఖాస్తులను సాంస్కృతిక శాఖ నియమించిన కమిటీ పరిశీలించి 4 వారాల్లో  నిర్ణయం తీసుకుంటుంది. వాటి పనితీరుపై సంతృప్తి చెందితే గడువు ముగిశాక రిజిస్ట్రేషన్‌ను పునరుద్ధరిస్తారు. పాలక మండలి సభ్యులు, ధర్మకర్తలు, చైర్మన్‌లలో ఎవరైనా వైదొలగినా, కొత్తవారు నియమితులైన సంగతిని, అన్నదానం చేస్తున్న ప్రాంతాలలో మార్పు తదితర సమాచారాన్ని సాంస్కృతిక శాఖకు ఎప్పటికప్పుడు తెలియజేసే బాధ్యత ఆ సంస్థపైనే ఉంటుంది.

మరిన్ని వార్తలు