అవినీతి అంతంచేసే చిత్తశుద్ధి ఎవరికైనా ఉందా?

6 Feb, 2019 15:37 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘లోక్‌పాల్, లోకాయుక్త చట్టం–2013’ కింద కేంద్ర స్థాయిలో లోక్‌పాల్, మహరాష్ట్రలో లోకాయుక్తను ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో సామాజిక కార్యకర్త అన్నా హజారే గత వారం రోజులుగా చేస్తున్న నిరాహార దీక్షను మంగళవారం విరమించిన విషయం తెల్సిందే. హజారే దీక్షను విరమింపచేసేందుకు జూనియర్‌ మంత్రులను పంపించినా లాభం లేకపోవడంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ స్వయంగా వెళ్లి హజారే దీక్షను విరమింప చేశారు. రాష్ట్ర స్థాయిలో లోకాయుక్త చట్టాన్ని తీసుకొస్తానని ఫడ్నవీస్‌ హామీ ఇచ్చి ఉండవచ్చుగానీ కేంద్ర స్థాయిలో లోక్‌పాల్‌ను ఏర్పాటు చేస్తానని ఏ హోదాలో హామీ ఇచ్చారో, ఆ హామీని అన్నా హజారే ఎలా విశ్వసించారో వారికే తెలియాలి. 

‘దేశంలోని అవినీతికి వ్యతిరేకంగా భారత యుద్ధం’  అంటూ అన్నా హజారే పోరాటం చేయడం వల్లనే 2013లో లోక్‌పాల్, లోకాయుక్త చట్టం వచ్చింది. అవినీతిలో కూరుకుపోయిన నాటి యూపీఏ ప్రభుత్వం కూలిపోవడానికి, అవినీతికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకుంటామన్న నరేంద్ర మోదీ నేతత్వంలో బీజేపీ అధికారంలోకి రావడానికి నాటి అన్నా హజారే చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమం ఎంతో తోడ్పడింది. అవినీతి అంతు చూస్తానన్న నరేంద్ర మోదీ తన నాలుగున్నర ఏళ్ల పాలనలో కేంద్ర స్థాయిలో లోక్‌పాల్‌ను నియమించలేక పోయారు. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్రంలో లోకాయుక్త నియామకానికి ససేమిరా అంగీకరించని మోదీ లోక్‌పాల్‌ను నియమిస్తారని ఆశించడం అత్యాశే అవుతుందేమో!

2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోదీ తన రాజకీయ ప్రత్యర్థుల అవినీతి గురించి ప్రధానంగా ప్రస్తావించారు. అధికారంలోకి వచ్చాక వారెవరిపైనా ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు. ఆర్జేడీ నాయకుడు లాలూను జైలుకు పంపించడం, యూపీలో అఖిలేష్‌ యాదవ్, మాయావతిలపై, పశ్చిమ బెంగాల్లో పోలీసు కమిషనర్‌పై ఏసీబీ దాడులు జరపడం రాజకీయ కక్షలే తప్పించి అవినీతి నిర్మూలనా చర్యలు ఎంత మాత్రం కావు. నేతల అవినీతిని పక్కన పెడితే అధికార యంత్రాంగంలో, సైనికుల్లో, పోలీసుల్లో అవినీతిని అరికట్టేందుకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదు. ఎలాంటి చట్టాలను తీసుకరాలేదు. అన్ని ప్రభుత్వ రంగాల్లో పారదర్శకతకు ప్రాధాన్యతను ఇచ్చినట్లయితే, అందుకు చట్టాలను తీసుకొచ్చినట్లయితే సగం అవినీతి దానంతట అదే తగ్గిపోయి ఉండేది. 

మోదీ ప్రభుత్వం 2016లో రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ చట్టం గహ నిర్మాణ రంగంలో పారదర్శకతను పెంచింది. తద్వారా ఇళ్ల కొనుగోలుదారులకు లబ్ధి చేకూరింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రతి రంగంలో ఇలాంటి చట్టాలను తీసుకరావాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది.

ప్రభుత్వంలోని అన్ని రంగాల్లో పారదర్శకతు ఆస్కారమిస్తూ అవినీతి బట్టబయలకు అవకాశం ఇస్తున్న ‘సమాచార హక్కు’ చట్టాన్ని నీరుకార్చేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నించడం విచిత్రం. తనతో సహా కొంత మంది మంత్రుల విద్యార్హతలను సమాచార హక్కు కింద వెల్లడించకుండా కేంద్ర విజిలెన్స్‌ కమిషనర్‌ను పీఎంవో కార్యాలయం అడ్డుకున్న విషయం తెల్సిందే. అలాగే కేంద్ర సమాచార కమిషనర్లను ప్రభుత్వం గుప్పిట్లో ఉంచుకోవడానికి వీలుగా వారి జీతభత్యాలను, పదవీకాలాన్ని కేంద్రమే నిర్ణయించే విధంగా సమాచార చట్టంలో రహస్యంగా సవరణ తీసుకొచ్చేందుకు ప్రయత్నించింది. ప్రస్తుతం సుప్రీం కోర్టుల జడ్జీలతో సమానంగా కేంద్ర సమాచార కమిషనర్లకు జీతభత్యాలు చెల్లిస్తున్నారు. సుప్రీం కోర్టు జడ్జీల జీతభత్యాలను ఎప్పటికప్పుడు పార్లమెంట్‌ నిర్ణయిస్తుందన్న విషయం తెల్సిందే. పార్లమెంట్‌ను మభ్యపెట్టడం ద్వారా కేవలం కేబినెట్‌ ఆమోదంతో ఆ సవరణ తీసుకరావాలనుకుంది. అదికాస్త బయటకు పొక్కడంతో ఇప్పటి వరకు దీనికి సంబంధించిన సవరణ బిల్లును మోదీ ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టలేక పోయింది. 

గోవా పోలీసు అధికారి అమ్జద్‌ కరోల్‌ 2014లో ఓ పేద మహిళలను బహిరంగంగా వివస్త్రను చేసి చితకబాదినా ఆయనపై ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోలేదు. కనీసం విధుల నుంచి సస్పెండ్‌ కూడా చేయలేదు. బీఎస్‌ఎఫ్‌ జవాను తేజ్‌ బహదూర్‌ యాదవ్‌ 2017లో అధికారుల అవినీతి కారణంగా తమకు ఎంత అధ్వాన్నమైన ఆహారాన్ని ఇస్తున్నారో వీడియో ద్వారా బయటపెడితే అందుకు బాధ్యులైన అధికారులపై చర్య తీసుకోకపోగా క్రమశిక్షణారాహిత్యం కింద బహదూర్‌ యాదవ్‌ను తొలగించారు. ఢిల్లీలో ప్రతిష్టాకరమైన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఏమ్స్‌) ఆస్పత్రిలో అవినీతి కార్యకలాపాలకు సంబంధించి అప్పటి ఆస్పత్రి విజిలెన్స్‌ కమిషనర్‌ మెగసెసే అవార్డు గ్రహీత సంజీవ్‌ చతుర్వేదీ బయటపెట్టినా కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 22 లక్షల మంది ఓటర్ల పేర్లు గల్లంతవడానికి బాధ్యుడయిన ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌ కుమార్‌పైనా ఎలాంటి చర్య తీసుకోలేదు. ఇలాంటి సంఘటనలు పునరావతం కాకుండా కఠిన చట్టాలు అవసరం. అందుకు చిత్తశుద్ధి ఇంకా ఎంతో అవసరం. 
 

మరిన్ని వార్తలు