త్వరలో అద్దె చట్టం

12 Jul, 2019 03:48 IST|Sakshi

స్థల/భవనాలను అద్దెకు ఇవ్వడంలో పలు నిబంధనలు

నమూనా బిల్లు విడుదల

న్యూఢిల్లీ: దేశంలో భవనాలు, స్థలాలను అద్దెకు ఇవ్వడానికి సంబంధించి పలు నిబంధనలను రూపొందిస్తూ ‘అద్దె చట్టం’ తీసుకురావడానికి కేంద్రం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా బిల్లుపై ఆగస్టు 1లోపు ప్రజలు తమ అభిప్రాయాలను తెలపవచ్చు. స్థల/భవన యజమానులతోపాటు అద్దెకు ఉండేవారు నష్టపోకుండా ఉండటం కోసం కేంద్రం పలు నిబంధనలను ఈ బిల్లులో ప్రతిపాదించింది.

బిల్లులోని కొన్ని ప్రతిపాదనలు..
► అద్దె పెంచాలంటే 3నెలల ముందే ఆ విషయాన్ని కిరాయిదారుకు యజమాని  రాతపూర్వకంగా తెలియజెప్పాలి.
 

► అద్దెకు భవనం/స్థలం తీసుకున్నవారు ముందుగా ఒప్పందం చేసుకున్న కాలం కంటే ఎక్కువ రోజులు అక్కడ ఉంటూ, సమయానికి ఖాళీ చేయకపోతే 2–4 రెట్లు అధిక అద్దె చెల్లించాల్సి ఉంటుంది.

► అడ్వాన్స్‌ లేదా సెక్యూరిటీ డిపాజిట్‌ కింద యజమానులు వసూలు చేసే డబ్బు రెండు నెలల అద్దె కంటే ఎక్కువ ఉండకూడదు. 

► ఇంట్లో ఏదైనా రిపేర్లు చేయించాల్సి వచ్చి, ఆ విషయాన్ని యజమాని పట్టించుకోకపోతే అద్దెకు ఉంటున్నవారు ఆ రిపేర్లు చేయించి, అందుకు అయిన వ్యయాన్ని అద్దెలో మినహాయించుకోవచ్చు. ఆ రిపేర్లు అద్దెకు ఉంటున్న వారే చేయించాల్సినవి అయినప్పటికీ వారు పట్టించుకోకపోతే, యజమాని ఆ పనిని చేపించి, అందుకు అయిన వ్యయాన్ని అడ్వాన్సు/సెక్యూరిటీ డిపాజిట్‌ నుంచి మినహాయించుకోవచ్చు.

► యజమానులు, కిరాయిదారుల ఫిర్యాదుల పరిష్కారానికి జిల్లా కలెక్టర్‌ పర్యవేక్షణలో జిల్లా అద్దె వ్యవహారాల విభాగం ఏర్పాటు 

► అద్దె ఒప్పందం కుదుర్చుకున్న రెండు నెలల్లోపు యజయాని, అద్దెకు వచ్చిన వారు.. ఇద్దరూ వెళ్లి అద్దె ఒప్పంద పత్రాన్ని జిల్లా అద్దె వ్యవహారాల విభాగానికి సమర్పించాలి. ఈ విభాగానికి అద్దెను నిర్ణయించడం, సవరించడం వంటి అధికారాలు కూడా ఉంటాయి.

ఢిల్లీలో నకిలీ దరఖాస్తులపై ఎఫ్‌ఐఆర్‌
ప్రధాన మంత్రి (పట్టణ) ఇళ్ల పథకం కోసమంటూ నకిలీ దరఖాస్తులను వ్యాప్తి చేస్తున్న  వ్యక్తులపై కేసు నమోదైంది. ఇళ్ల నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు పెట్టారు.

మరిన్ని వార్తలు