రైతులపై వరాల జల్లు కురిపించనున్న మోదీ సర్కార్‌?

28 Jan, 2019 18:30 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  రానున్న లోక్‌సభ ఎన్నికల నేపథ‍్యంలో రైతులపై వరాల జల్లు కురిపించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రతిపాదనల అమలుకు ఆమోదానికి మొగ్గు  చూపనుందని తెలుస్తోంది.  దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన వ్యవసాయం రంగంలో నెలకొన్న సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు స్వల్ప, దీర్ఘకాలిక  పరిష్కాలను మంత్రిత్వ శాఖ కేంద్రానికి  సూచించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన తుది నిర్ణయం కేబినెట్ సమావేశంలో తీసుకోనున్నారు. రైతుల ఆదాయాన్ని పెంచేందుకుగాను వడ్డీ మినహాయింపు, ఇన్సూరెన్స్ ప్రీమియం మాఫీ, నగదు బదిలీ లాంటి  ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించేలా నిర్ణయాలు ఉండొచ్చని విశ్వసనీయ వర్గాలు సమాచారం. 

డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్సఫర్‌​ ద్వారా ఎకరానికి సీజనుకు 4వేల  రూపాయలను అందించే పథకాన్ని ప్రకటించనుంది. అంటే తెలంగాణ, ఒడిశా ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాల మాదిరిగా రైతు బ్యాంకు ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమచేయడం. దీని వల్ల ప్రభుత్వానికి అదనంగా ఏడాదికి రూ. 2లక్షల కోట్ల భారం  పడనుంది. అలాగే  రైతు రుణాలపై వడ్డీ మినహాయింపు కీలకమైనదిగా తెలుస్తోంది. లక్ష రూపాయల దాకా వడ్డీలేని రుణ సదుపాయాన్ని కల్పించనుంది. ప్రస్తుతం రుణాలపై అతి తక్కువగా 4శాతం వడ్డీని  చెల్లిస్తున్నారు. అలాగే ఆహార పంటలకు తీసుకున్న ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని పూర్తిగా మాఫీ చేయడం మరో ప్రతిపాదన. 

కాగా 2019-20 మధ్యంతర బడ్జెట్‌ కంటే ముందే రైతులకు ప్రత్యేక ప్యాకేజ్ ఉంటుందంటూ వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ వ్యాఖ్యలు అంచనాలను
మరింత బలాన్నిస్తున్నాయి. 

మరిన్ని వార్తలు