గర్జించిన అన్నదాత

1 Dec, 2018 01:25 IST|Sakshi
ర్యాలీకి సంఘీభావం తెలుపుతున్న కేజ్రీవాల్, ఏచూరీ, ఫరూక్, రాహుల్, శరద్, డీ రాజా

పార్లమెంట్‌ వైపు ర్యాలీగా సాగిన వేలాది మంది రైతులు

అడ్డుకున్న పోలీసులు

21 పార్టీల సంఘీభావం  

న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: అన్నదాత గర్జనతో రాజధాని ఢిల్లీ దద్దరిల్లింది. దేశం నలుమూలల నుంచి వచ్చిన రైతులు శుక్రవారం నిర్వహించిన మహా ర్యాలీ విజయవంతమైంది. సప్త వర్ణాలను తలపించేలా పతాకాలు చేతబట్టిన రైతన్నలు రామ్‌లీలా మైదానం నుంచి పార్లమెంటు స్ట్రీట్‌కు సమీపంలోని జంతర్‌ మంతర్‌ వరకు ర్యాలీ నిర్వహించి తమ నిరసన తెలిపారు. అడుగడుగునా పోలీసు బందోబస్తు, దారిపొడవునా బారికేడ్లు, వాటర్‌ క్యానన్లు, పోలీసు కెమెరాలు, సాయుధ బలగాలకు తొణకకుండా ముందుకు సాగారు.

పంటలకు గిట్టుబాటు, మద్దతు ధర కల్పించాలని, శాశ్వతంగా రుణ విముక్తి కల్పించాలన్న డిమాండ్‌తో అఖిల భారత కిసాన్‌ పోరాట సమన్వయ సమితి (ఏఐకేఎస్‌సీసీ) ఇచ్చిన పిలుపు మేరకు ఈ రెండు రోజుల కవాతు జరిగింది. రామ్‌లీలా మైదానం నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలోని పార్లమెంటుకు ర్యాలీగా బయల్దేరారు. కానీ జంతర్‌మంతర్‌ వద్దే పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే రైతు పార్లమెంట్‌ నిర్వహించి తమ డిమాండ్లపై పలు తీర్మానాలు చేశారు. ఢిల్లీలో ఇటీవలి కాలంలో జరిగిన అతి పెద్ద ర్యాలీగా చెబుతున్న ఈ కార్యక్రమంలో ఏఐకేఎస్‌సీసీ నాయకులు మేథాపాట్కర్, యోగేంద్ర యాదవ్, అతుల్‌ కుమార్, హన్నన్‌ మొల్లా, కవితా కురగంటి, వీఎంకే సింగ్‌ తదితరులు ముందు నడవగా రైతులు వారిని అనుసరించారు.

అయోధ్య కాదు..రుణ మాఫీ కావాలి:
డప్పు నృత్యాలు, అర్ధనగ్న ప్రదర్శనలు, కోలాటాలు, విచిత్ర వేషాలు, గిరిజన నత్యాలు, ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కపాలాలు, ఉరితాళ్లు, అప్పుల కోసం రాసిన ప్రామిసరీ నోట్లు వంటివి ప్రదర్శిస్తూ రైతులు ర్యాలీలో పాల్గొన్నారు. ‘అయోధ్య–రామజన్మభూమి కాదు.. రుణాలు మాఫీ కావాలి’, ‘రైతుల్ని రుణభారం నుంచి విముక్తం చేయాలి’, ‘చౌకీదార్‌ బడాచోర్‌’, ‘మోదీ కిసాన్‌ విరోధి’, ‘ఇంక్విలాబ్‌ జిందాబాద్‌’, ‘కిసాన్‌ ఏక్తా– జిందాబాద్‌’ లాంటి నినాదాలు ఢిల్లీ వీధుల్లో మార్మోగాయి.

పోలీసులు అడ్డగించిన చోటల్లా రైతు ఉద్యమకారులు రోడ్లపై బైఠాయించి నిరసన తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, బెంగాల్, పంజాబ్‌సహా దేశంలోని 24 రాష్ట్రాల రైతులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. తెలంగాణ నుంచి వచ్చిన మహిళలు అనేక మంది అప్పుల భారంతో మరణించిన తమ కుటుంబ పెద్దల ఫొటోలను చేతబూని ర్యాలీలో పాల్గొనగా ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చిన రైతులు.. ‘రుణమాఫీ పెద్ద దగా’ అని రాసి ఉన్న బ్యానర్లను ప్రదర్శించారు.

రైతు సమస్యలే అజెండా కావాలి...
జంతర్‌మంతర్‌ వద్ద రైతు పార్లమెంట్‌(సభ)లో పలువురు వక్తలు ప్రసంగిస్తూ.. రైతులు బిచ్చగాళ్లు కాదని, అన్ని రాజకీయ పార్టీలు ఒకే తాటిపై నిలిచి ఒకే వాణి వినిపించాలని విజ్ఞప్తి చేశారు. రైతు వ్యతిరేక ప్రభుత్వం ఏదీ బతికి బట్ట కట్టలేదని, అయోధ్య, రామజన్మభూమి..రైతు ఆత్మహత్యల కన్నా ఎక్కువ కాదని అన్నారు. మరోవైపు, రుణ విముక్తి, వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లులకు అన్ని రాజకీయ పార్టీల మద్దతివ్వాలని విజ్ఞప్తి చేస్తూ రైతు సదస్సు తీర్మానం చేసింది.

రైతు మేనిఫెస్టోను ఆమోదిస్తూ మరో తీర్మానం చేసింది. రైతు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏకేఎస్‌సీసీ నేతలు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. జంతర్‌మంతర్‌ వద్ద రైతుల్ని ఉద్దేశించి ప్రసంగించిన వారిలో రాహుల్, కేజ్రీవాల్‌తో పాటు సీతారాం ఏచూరీ (సీపీఎం), సురవరం సుధాకరరెడ్డి (సీపీఐ), శరద్‌ పవార్‌     (ఎన్‌సీపీ), ఫరూక్‌ అబ్దుల్లా (నేషనల్‌ కాన్ఫరెన్స్‌), శరద్‌ యాదవ్‌ (ఎల్‌జేడీ) తదితర జాతీయ నాయకులున్నారు.  

సంపన్నులకేనా రుణమాఫీ: రాహుల్‌
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానికి సన్నిహితులైన 15 మంది బడా పారిశ్రామికవేత్తలు బకాయిలు పడిన రూ.3.5 లక్షల కోట్ల రుణాల్ని మాఫీ చేసిన ప్రభుత్వం రైతు రుణాలను ఎందుకు విస్మరిస్తోందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నిలదీశారు. రైతులు ప్రభుత్వం నుంచి ఉచిత కానుకలు కోరడం లేదని వారు అడుగుతున్న రుణమాఫీ, మద్దతు ధర వారి హక్కని రైతు సభలో పేర్కొన్నారు. రైతులు, యువత గొంతుకల్ని ప్రభుత్వం అణగదొక్కలేదని, ఒకవేళ వారిని అవమానిస్తే ఆ ప్రభుత్వాన్ని పడగొడతామని హెచ్చరించారు. ఫసల్‌ బీమా యోజన ద్వారా అనిల్‌ అంబానీ సంస్థలకు ప్రధాని దోచిపెడుతున్నారని మండిపడ్డారు.

బీమా పథకాన్ని రెండుగా విభజించి అంబానీ, అదానీ సంస్థలకు పంచిపెట్టారని మండిపడ్డారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ మాట్లాడుతూ..స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు చేయలేమని సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేయడం ద్వారా రైతులను ప్రధాని నరేంద్ర మోదీ వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. ఎన్డీయే హయాంలో వ్యవసాయ రంగం తిరోగమన బాట పట్టిందని, అందువల్లే రైతు ఆత్మహత్యలు పెరిగాయని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. బీజేపీ విభజనవాద రాజకీయాలపై గళమెత్తాలని, రైతు సమస్యలపై అందరూ ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. మోదీ–అమిత్‌ షా ద్వయాన్ని ఆయన దుర్యోదన–దుశ్శాసనలుగా అభివర్ణించారు.   


శుక్రవారం ఢిల్లీలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న  రైతులు


ఢిల్లీలో జరిగిన మహా ర్యాలీలో పాల్గొన్న తెలంగాణ రైతులు

>
మరిన్ని వార్తలు