లైంగిక వేధింపులపై జీవోఎం

25 Oct, 2018 03:40 IST|Sakshi

3 నెలల్లో కేంద్రానికి నివేదిక

న్యూఢిల్లీ: పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపులను నిరోధించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కార్యాలయాల్లో లైంగిక వేధింపుల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై సిఫార్సు చేసేందుకు హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలో కేంద్ర మంత్రుల బృందాన్ని (జీవోఎం) నియమించింది. ఇందులో రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖమంత్రి మేనకా గాంధీ, ఉపరితల రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీ సభ్యులుగా ఉంటారు. మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలు, నియమ నిబంధనలను ఈ బృందం సమీక్షిస్తుందని హోంశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

అన్నివర్గాలను సంప్రదించి లైంగిక వేధింపుల నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపై 3 నెలల్లోగా జీవోఎం కేంద్రానికి నివేదికను సమర్పిస్తుందని వెల్లడించింది. పని ప్రదేశంలో మహిళల గౌరవాన్ని కాపాడటానికి, భద్రత కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంది. మరోవైపు మహిళా ఉద్యోగులు తమకు ఎదురయ్యే లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు ‘షీ–బాక్స్‌’ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రకటించింది. ఏ స్థాయి ఉద్యోగిని అయినా ఇందులో ఫిర్యాదు చేస్తే, కంపెనీలోని సంబంధిత పరిష్కార విభాగానికి దీన్ని బదిలీ చేస్తామని వెల్లడించింది. బాధితుల ఫిర్యాదుపై చర్యలు తీసుకున్నారా? లేదా? అన్న విషయాన్ని పరిశీలించేందుకు ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని పేర్కొంది.

>
మరిన్ని వార్తలు