ముసురుకున్న సందేహాలు

6 Aug, 2019 03:23 IST|Sakshi

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌ను పునర్విభజిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చట్టబద్ధతపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్టికల్‌ –370ను రద్దు చేయడం జమ్మూకశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సాంకేతికంగా సవరిస్తుందనే విమర్శలు ఎదురవుతున్నాయి.

ఇవీ చిక్కులు
► ఆర్టికల్‌ 370 (3) ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వులపై ‘రాజ్యాం గబద్ధమైన అసెంబ్లీ (కాన్‌స్టిట్యుయంట్‌ అసెంబ్లీ)’ సలహా తీసు కోవాల్సి ఉంటుంది. రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా దీన్ని ‘శాసనసభ (లెజిస్లేటివ్‌ అసెంబ్లీ)’గా సవరించారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లో శాసనసభ లేనందున ఆ అధికారాలు గవర్నర్‌కు దఖలు పడ్డాయి. గవర్నర్‌ సూచనల మేరకే ఆర్టికల్‌ –370ను రద్దు చేశారు. అయితే, ఇది చెల్లదని కొందరు నిపుణులు వాదిస్తున్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు ‘ముందు’ రాజ్యాంగబద్ధమైన అసెంబ్లీ నుంచి ఏకాభ్రిపాయం సేకరించాలని ఆర్టికల్‌ 370 (3)పేర్కొంటోంది.

► శాసనసభ ఎన్నికైన ప్రజాప్రతినిధులతో కూడుకున్నది కాగా గవర్నర్‌ కేంద్రం ప్రతినిధిగా నియమితులవుతారు. ఎన్నికైన ప్రజాప్రతినిధుల స్థానంలో గవర్నర్‌ సూచనల ఆధారంగా ఆర్టికల్‌ –370ను రద్దు చేయవచ్చా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

► మరోవైపు ఆర్టికల్‌ –370 తాత్కాలికం కాదని 2016లో ఎస్బీఐ వర్సెస్‌ సంతోష్‌ గుప్తా కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులు పేర్కొంటున్నాయి. రాజ్యాంగ బద్ధమైన అసెంబ్లీ సూచనలు చేసే వరకు అది ‘పర్మినెంటే’ అని చెబుతోంది. జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ నుంచి అలాంటి సూచనలు ఏవీ రాలేదు.

► రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని సవరించడం, మార్చడం చెల్లదని పలు తీర్పుల్లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆర్టికల్‌ –370 అందులో భాగమేనా? దాన్ని మార్చవచ్చా?

► ఆర్టికల్‌ –370 రద్దు భారత్‌లో జమ్మూకశ్మీర్‌ విలీనాన్ని సాంకేతికంగా సవరిస్తుంది.
అంతర్జాతీయంగా అభ్యంతరం

► ఐరాస భద్రతా మండలి 47వ తీర్మానం ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా కశ్మీర్‌ ప్రజలకు స్వయం నిర్ణయాధికార హక్కు కల్పించింది. ఆర్టికల్‌ –370 రద్దు, స్వయం ప్రతిపత్తిని తొలగించడం ఐరాస భద్రతా మండలి తీర్మానం ఉల్లంఘనగా మారే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు