పంట రుణాలపై 660 కోట్ల వడ్డీ మాఫీ

25 Jan, 2017 02:14 IST|Sakshi
పంట రుణాలపై 660 కోట్ల వడ్డీ మాఫీ

నవంబర్, డిసెంబర్‌లకు వర్తింపు
► గృహ రుణ వడ్డీ  రాయితీ పథకానికి ఓకే
► వరిష్ట పెన్షన్  బీమా యోజనకూ ఆమోదం
► కేంద్ర కేబినెట్‌ నిర్ణయాలు

న్యూఢిల్లీ: నోట్ల రద్దుతో నగదు దొరక్క ఇబ్బందులు పడుతున్న రైతులకు ప్రభుత్వం కాస్త ఊరట కల్పించింది. సహకార బ్యాంకుల నుంచి 2016 ఏప్రిల్‌–సెప్టెంబర్‌ మధ్య తీసుకున్న స్వల్పకాలిక పంటరుణాలపై ఆ ఏడాది నవంబర్, డిసెంబర్‌ నెలలకుగాను రూ. 660.50 కోట్ల వడ్డీని మాఫీ చేసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన కేంద్ర కేబినెట్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు. నవంబర్, డిసెంబర్‌ల వడ్డీని చెల్లించిన రైతులకు ఆ మొత్తాన్ని ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా వారి బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమచేస్తుందని వ్యవసాయ మంత్రి రాధామోహన్  సింగ్‌ చెప్పారు. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సహకార బ్యాంకులకు 4.5 శాతం వడ్డీతో రుణంగా ఇవ్వడానికి రూ. 20 వేల కోట్ల రుణాలను తీసుకునేందుకు నాబార్డ్‌కు కేబినెట్‌ అనుమతినిచ్చింది. 1.8 శాతం వడ్డీ రాయితీ, 0.2 శాతం పాలనా వ్యయాన్ని నాబార్డ్‌ భరించేందుకు రూ. 400 కోట్ల గ్రాంట్‌ కూడా ఇవ్వాలని నిర్ణయించింది.

గృహ రుణాలపై 3 శాతం వడ్డీ రాయితీ
గ్రామీణ ప్రజలు కొత్త ఇళ్లు కట్టుకోవడానికి, లేదా ప్రస్తుత ఇళ్ల అభివృద్ధి కోసం తీసుకునే గృహ రుణాలపై 3 శాతం వడ్డీ రాయితీ ఇచ్చే పథకానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి ఆవాసయోజన(గ్రామీణ్‌) కిందికి రాని ప్రతి కుటుంబానికీ రూ. 2 లక్షల వరకు రుణంపై ఈ రాయితీ ఇస్తారు. దీనితో పేదలకు నెల వాయిదాల(ఈఎంఐ)పై భారం తగ్గుతుందని, ఈ పథకాన్ని నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌ అమలు చేస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. ప్రధాని మోదీ కొత్త ఏడాది ప్రారంభం సందర్భంగా ఈ పథకాన్ని ప్రకటించడం తెలిసిందే.

సీనియర్‌ సిటిజన్లకు 8 శాతం వడ్డీ
సీనియర్‌ సిటిజన్లకు పదేళ్లపాటు ఏటా 8 శాతం వడ్డీ ఇచ్చే వరిష్ట పెన్షన్  బీమా యోజన–2017 పథకానికి కేంద్రం ఆమోదం తెలిపింది. నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది.. వీటిలో దేన్ని ఎంచుకుంటే దాని ప్రాతిపదికగా పెన్షన్ అందిస్తారు. ఎల్‌ఐసీ అమలు చేయనున్న ఈ పథకంలో 60 ఏళ్లు, ఆపై వయసున్న వారు పథకం మొదలైన నాటి నుంచి ఏడాది లోపల చేరవచ్చు.

ఐఐఎంల నుంచి ఇక డిగ్రీలు
దేశంలోని 20 ఇండియన్  ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం)లు ఇకపై తమ విద్యార్థులకు పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లమా, ఫెలో ప్రోగ్రామ్స్‌ ఇన్  మేనేజ్‌మెంట్‌లు కాకుండా ఎంబీఏ వంటి డిగ్రీలు, పీహెచ్‌డీలు ఇవ్వనున్నాయి. ఐఐఎంలను ఇకపై జాతీయ ప్రాధాన్య సంస్థలుగా గుర్తిస్తారు. దీనికి సంబంధించిన ఐఐఎం–2017 బిల్లును కేబినెట్‌ ఆమోదించింది. దీన్ని వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెడతారు. ఐఐఎంలకు సంపూర్ణ స్వయంప్రతిపత్తిపై బిల్లు దృష్టి సారించిందని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.

ప్రస్తుతం ఐఐఎంలు సొసైటీల చట్టం కింద రిజిస్టర్‌ అయి ఉండడంతో వీటికి డిగ్రీలు ఇచ్చే అవకాశం లేదు.  ఈ సంస్థలు ఇచ్చే  డిప్లమాలు, ఫెలో ప్రోగ్రామ్‌లు.. ఎంబీఏ, పీహెచ్‌డీలకు సమానంగా భావిస్తున్నా  వీటి సమానత్వంపై  సార్వత్రిక ఆమోదం లేదు.   కాగా, హరితవాయు ఉద్గారాల కట్టడికి కోసం క్యోటో ప్రొటోకాల్‌ రెండో దశ అమలుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఎన్నారైలకు ఎలక్ట్రానిక్‌ మాధ్యమంలోనూ, ప్రతినిధి ద్వారానూ ఓటు వేసే అవకాశం కల్పించాలన్న ప్రతిపాదనను వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు