కుల వివక్ష మద్దతుదారులతో జాగ్రత్త

20 Feb, 2019 00:46 IST|Sakshi

అమరవీరుల కుటుంబాలకు సదా రుణపడి ఉంటాం 

వారణాసిలో ప్రధాని మోదీ రూ.3 వేల కోట్ల ప్రాజెక్టుల ప్రారంభం 

వారణాసి: కుల వివక్షకు ముగింపు పలకాలని, స్వప్రయోజనాల కోసం దాన్ని ప్రచారం చేస్తున్న వారితో అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రముఖ కవి గురు రవిదాస్‌ జయంతి సందర్భంగా మంగళవారం మోదీ వారణాసిలో రవిదాస్‌ జన్మస్థలి ఏరియా డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. సామాజిక సామరస్యానికి కుల వివక్ష పెద్ద అడ్డంకి అన్న రవిదాస్‌ పంక్తుల్ని ఈ సందర్భంగా ఉటంకించారు. ఈ సందర్భంగా రూ.3 వేల కోట్ల విలువైన పలు పథకాలను ప్రారంభించి, రెండు బహిరంగ సభల్లో ప్రసంగించారు. పుల్వామా దాడిలో మరణించిన వారణాసికి చెందిన జవాన్‌ రమేశ్‌ యాదవ్‌కు నివాళులర్పించిన మోదీ..అమర జవాన్ల కుటుంబాలకు దేశం ఎల్లప్పుడూ రుణ పడి ఉంటుందని అన్నారు. ఇటీవల ప్రారంభమైన సెమీ హైస్పీడ్‌ రైలు ‘వందేభారత్‌’పై వ్యంగ్య వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌.. ఈ ప్రాజెక్టులో పాలుపంచుకున్న ఇంజినీర్లను అవమానించారని పేర్కొన్నారు. మోదీ వారణాసి పుత్రుడని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అభివర్ణించారు. 

‘పంచధర్మ’పై దృష్టి..  
‘కులం ఆధారంగా వివక్ష ఉండకూడదని గురు రవిదాస్‌ ఆనాడే చెప్పారు. కుల వివక్ష ఉన్నంత కాలం ప్రజలు ఒకరితో ఒకరు కలవరు. సామాజిక సామరస్యం, సమానత్వం సాధ్యం కావు. తమ సొంత ప్రయోజనాల కోసం కుల వివక్షను ఎవరు ప్రచారం చేస్తున్నారో గుర్తించండి. అందరూ బాగుండే సమాజం గురించి గురూజీ కలలు కన్నారు. సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్‌తో ఈ నాలుగున్నరేళ్లుగా మేము గురూజీ సిద్ధాంతాల్ని పాటిస్తున్నాం. విద్య, ఆదాయం, వైద్యం, నీటి పారుదల, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం..అనే ‘పంచధర్మ’పై ప్రభుత్వం దృష్టి పెట్టింది. కులం, మతంతో సంబంధం లేకుండా ఈ ఐదింటిని ప్రజలందరికీ అందించడమే మా లక్ష్యం.  యువత సాయంతో నవభారతంలో మార్పు వస్తుందని ఆశిస్తున్నా’ అని మోదీ అన్నారు.  

మరిన్ని వార్తలు