ఇలా చేయడం పీఐబీకి అలవాటే....

8 Dec, 2015 11:42 IST|Sakshi
ఇలా చేయడం పీఐబీకి అలవాటే....

న్యూఢిల్లీ : చెన్నై వరద పరిస్థితిని సమీక్షించడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్వహించిన ఏరియల్ సర్వేకు సంబంధించిన ఫొటోల విషయంలో ఫొటోషాప్ చేసి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) అభాసుపాలైన విషయం తెలిసిందే. అయితే  కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఈ సంస్థ ఇలా అభాసుపాలవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో భారత ప్రధానిగా మన్మోహన్ సింగ్ పని చేసిన సమయంలో.. ఆయన ఫొటోలను కూడా ఇదే విధంగా ఫొటోషాప్ చేసి విడుదల చేసిందట. ఈ మేరకు తమ సర్వేలో వెల్లడైందని ఎన్డీటీవీ మంగళవారం వెల్లడించింది. అయితే అందుకు సంబంధించిన చిత్రాలు మాత్రం ప్రస్తుతం పీఐబీ వద్ద లేవని తెలిపింది.

చెన్నై మహానగరాన్ని భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల చెన్నై మహానగరంలో ఏరియల్ సర్వే నిర్వహించారు. అందులోభాగంగా ఆయన కిటికిలో నుంచి వరద ముంపు ప్రాంతాలను పరిశీలించారు. ఆ దృశ్యాలను పీఐబీ ఫొటోషాప్ చేసి విడుదల చేసింది. ప్రధాని చూస్తున్న ఏరియల్‌ వ్యూలో అపార్టుమెంట్లు, బహుళ అంతస్తు భవనాలు అత్యంత సమీపంలో ఉన్నట్లు మార్చిన ఫొటోలను ఉంచారు.

సహజంగా ఏరియల్‌ వ్యూ ద్వారా సర్వే చేస్తున్న వారికి భూ భాగం పైన అంతా పచ్చగా కనిపిస్తుంది తప్ప, ఇళ్లు, అపార్టుమెంట్ల వంటి భవనాలు స్పష్టంగా కనిపించవు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో నాలుక కరుచుకున్న పీఐబీలను వెబ్సైట్ నుంచి తొలగించి తిరిగి మామూలు ఫోటోలు పెట్టి వివరణ ఇచ్చుకుంది. అయితే మోదీ ఫొటోను రకరకాలుగా మార్ఫింగ్ చేసి  నెట్జనులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వ్యంగోక్తులు విసురుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్డీటీవీ సర్వే నిర్వహించింది.

>
మరిన్ని వార్తలు