టెకీలకు గమ్యస్ధానం భారత్‌ : మోదీ

14 Nov, 2018 09:37 IST|Sakshi

సింగపూర్‌ : ఫిన్‌టెక్‌ కంపెనీలు, స్టార్టప్‌లకు భారత్‌ గమ్యస్ధానంలా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆర్థిక సమ్మిళిత శక్తిగా భారత్‌ అవతరిస్తోందని, గత కొన్నేళ్లలో తాము 120 కోట్ల మందికి ఆధార్‌ ద్వారా బయోమెట్రిక్‌ గుర్తింపునిచ్చామని చెప్పారు. సింగపూర్‌ వేదికగా బుధవారం ఫిన్‌టెక్‌ 2018 సదస్సులో ప్రధాని కీలకోపన్యాసం చేశారు.

ఆధార్‌, మొబైల్‌ ఫోన్ల ద్వారా తమ ప్రభుత్వం మూడేళ్లలో 30 కోట్ల మందికి జన్‌థన్‌ యోజనక కింద నూతన బ్యాంక్‌ ఖాతాలను అందుబాటులోకి తెచ్చిందన్నారు. 2014కు ముందు భారత్‌లో కేవలం సగం జనాభా కంటే తక్కువ మందికే బ్యాంక్‌ ఖాతాలుండగా, నేడు దాదాపు ప్రతి ఒక్కరికీ బ్యాంక్‌ ఖాతా ఉందన్నారు.

వంద కోట్లకు పైగా బ్యాంక్‌ ఖాతాలు, వంద కోట్ల పైగా సెల్‌ ఫోన్‌లతో భారత్‌ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా మౌలిక వసతులతో ముందున్నదన్నారు. తాము స్వల్పకాలంలోనే సాంకేతికతను అందిపుచ్చకున్నామని ప్రస్తుతం ఐటీ సేవల నుంచి ఇంటర్‌నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ దిశగా దూసుకెళుతున్నామని చెప్పుకొచ్చారు. ఫిన్‌టెక్‌ ఫెస్టివల్‌ 2018లో 100 దేశాల నుంచి దాదాపు 30,000 మందికి పగా ప్రతినిధులు పాల్గొంటున్నారు.

మరిన్ని వార్తలు