టైమ్స్‌ కథనంపై స్పందించిన మోదీ

18 May, 2019 09:17 IST|Sakshi

న్యూఢిల్లీ : ‘భారత విభజన సారథి’ అనే శీర్షికన కొద్ది రోజుల క్రితం టైమ్ మ్యాగజైన్‌ ప్రధాని నరేంద్ర మోదీపై ఓ కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. దీనిపై శుక్రవారం మోదీ స్పందించారు.  ‘టైమ్ మ్యాగజైన్‌ విదేశీ పత్రిక. దానిలో నా గురించి కథనం రాసిన వ్యక్తి పాకిస్థానీ రాజకీయ కుటుంబం నుంచి వచ్చానని చెప్పారు. ఇది చాలు ఆయన విశ్వసనీయత ఏంటో చెప్పడానికి’ అని మోదీ వ్యాఖ్యానించారు.

టైమ్‌ మ్యాగజైన్‌లో ఈ కవర్‌ స్టోరీని అతీశ్‌ తసీర్‌ రాశారు. ‘ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం గతంలో కంటే ఎక్కువ విభజనకు గురవుతోంది’ అని పేర్కొన్నారు. దానిలో మూక దాడులు, యోగి ఆదిత్యనాథ్‌ను యూపీ ముఖ్యమంత్రిగా నియమించడం, మాలేగావ్ పేలుడు నిందితురాలు ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌కు లోక్‌సభ టికెట్ ఇవ్వడం వంటి పలు అంశాలను  వివరించారు. దాంతో పాటు కాంగ్రెస్‌ పార్టీ మీద కూడా విమర్శలు చేశారు.

‘134 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ పార్టీ రాహుల్‌ గాంధీకి మద్దతుగా ప్రచారం కోసం సోదరి ప్రియాంకను రంగంలోకి దించింది. ఇది అమెరికాలో డెమొక్రటిక్‌ పార్టీ తరఫున అధ్యక్ష పదవికి హిల్లరీ క్లింటన్, ఉపాధ్యక్ష పదవికి ఆమె కుమార్తె చెల్సియా పోటీపడటం లాంటిదే. బలహీన ప్రతిపక్షం ఉండటం  మోదీ అదృష్టమే. మోదీని ఓడించడం తప్ప వీరికి మరో అజెండా లేదు’ అని విమర్శించారు. విభజనాధికారి అంటూ టైమ్‌ మ్యాగ్‌జైన్‌ మోదీపై చేసిన విమర్శల మీద బీజేపీ తీవ్రంగా మండిపడింది.

మరిన్ని వార్తలు