మౌలిక ప్రాజెక్టులకు పటిష్ట విధానం

27 Apr, 2017 01:05 IST|Sakshi
మౌలిక ప్రాజెక్టులకు పటిష్ట విధానం

త్వరితగతిన పూర్తి చేయాలి: మోదీ
►  ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి
► మౌలిక రంగాల్లో పురోగతిపై సుదీర్ఘ సమీక్ష


న్యూఢిల్లీ: దేశంలోని మౌలిక వసతుల ప్రాజెక్టులను నిర్ణీత కాలపరిమితిలో పూర్తి చేసేందుకు పటిష్టమైన విధానం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఇప్పటివరకూ ప్రయాణ సదుపాయం లేని ప్రాంతాల్లో చేపట్టిన ప్రాజెక్టులను సాధ్యమై నంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రహదారుల నిర్మాణానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవాలని సూచించారు. దీనికి సంబంధించి అంతర్జాతీయ ప్రమాణాలను అధ్యయనం చేయాలని, వాటిని భారత్‌లో వినియోగించే అంశాన్ని పరిశీలించాలని నీతి ఆయోగ్‌ను కోరారు.

రహదారులు, రైల్వే, ఎయిర్‌పోర్టులు, డిజిటల్‌ తదితర రంగాల్లో పురోగతిపై మంగళవారం రాత్రి ప్రధాని సుమారు నాలుగున్నర గంటల పాటు సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. దీనికి సబంధించి ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) బుధవారం ప్రకటన విడుదల చేసింది. సమీక్ష సందర్భంగా నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ మౌలిక వసతుల ప్రాజెక్టుల పురోగతిపై ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా మౌలిక వసతుల కల్పనతో పాటు వివిధ రంగాల్లో విశేషమైన పురోగతి సాధించినట్టు తెలిపారు.

ప్రధానమంత్రి గ్రామ సడక్‌ యోజన (పీఎంజీఎస్‌వై) కింద గ్రామీణ ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో రోజుకు సగటున 130 కి.మీ.మేర రహదారుల నిర్మాణం చేస్తున్నట్టు చెప్పారు. దీంతో 2016–17లో పీఎంజీఎస్‌వై కింద అదనంగా 47,400 కిలోమీటర్ల మేర రహదారులు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఇదే సమయంలో 11,641 నివాస ప్రాంతాలకు రహదారుల సదుపాయం కల్పించడం జరిగిందన్నారు. గ్రామీణ రహదారుల్లో 4 వేల కిలోమీటర్లకుపైగా గ్రీన్‌ టెక్నాలజీని వినియోగించి నిర్మించినట్టు వెల్లడించారు.

నిరంతరం పర్యవేక్షించాలి..
గ్రామీణ రహదారుల నిర్మాణం.. వాటి నాణ్యత ఎలా ఉంటోందనే విషయాన్ని పర్యవేక్షించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ అధికారులను ఆదేశించారు. ఇందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని సూచించారు. 2016–17 ఆర్థిక సంవత్సరంలో 26 వేలకుపైగా జాతీయ రహదారులను నిర్మించినట్టు అధికారులు తెలిపారు.

అలాగే 953 కిలోమీటర్ల కొత్త రైలు మార్గాన్ని నిర్మించినట్టు వివరించారు. 2 వేల కిలోమీటర్ల ట్రాక్‌ విద్యుదీకరణ, వెయ్యి కిలోమీటర్ల మేర గేజ్‌ మార్పిడి ప్రక్రియ పూర్తిచేసినట్టు తెలిపారు. 115 రైల్వే స్టేషన్లలో వైఫై సదుపాయం, 34 వేల బయో టాయిలెట్లు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులను వేగవంతం చేయాలని అధికారులను మోదీ ఆదేశించారు.

రైల్వేలో అవినీతిపై ప్రధాని సీరియస్‌
రైల్వే అధికారులు అవినీతికి పాల్పడుతున్నారంటూ పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు రావటంపై ప్రధాని తీవ్రంగా స్పందించారు. దోషులుగా తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులను హెచ్చరించారు. తమ ప్రభుత్వం అవినీతిని నిర్మూలించేందుకు చిత్తశుద్ధితో ఉందని మోదీ అన్నట్లు ప్రకటన పేర్కొంది. ఈ సమావేశంలో ముంబై మెట్రో, తిరుపతి–చెన్నై హైవేతోపాటుగా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్‌లలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రైలు, రోడ్డు ప్రాజెక్టులు, జమ్మూకశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లోని విద్యుత్‌ సరఫరా లైన్లపైనా సమీక్ష చేశారు.

రైల్వేల్లో సమస్యలు, ఫిర్యాదుల కోసం, ప్రమాదాలు జరిగినప్పుడు వివరాల కోసం కూడా ఏకీకృత టెలిఫోన్‌ నెంబరు ఏర్పాటుచేసుకోవాలని ప్రధాని సూచించారు. చిన్నారులకు సమస్యాత్మకంగా మారిన వ్యాధులకు టీకాల కోసం ఉద్దేశించిన ‘మిషన్‌ ఇంద్రధనుష్‌’ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఉన్న 100 అత్యంత వెనుకబడిన జిల్లాల్లో ప్రత్యేక వ్యూహంతో ముందుకు తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఎన్సీసీ, నెహ్రూ యువకేంద్ర సభ్యులను భాగస్వామ్యం చేయాలని సూచించారు. స్వచ్ఛ్‌ భారత్, అమృత్‌లపైనా సమీక్షించిన మోదీ.. 2022 కల్లా నవభారత నిర్మాణం కోసం స్పష్టమైన ప్రణాళికలు, లక్ష్యాలను రూపొందించాలని అన్ని కేంద్ర ప్రభుత్వ విభాగాల కార్యదర్శులు, రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను కోరారు.

>
మరిన్ని వార్తలు