‘పౌర రగడ వెనుక విపక్షం’

15 Dec, 2019 15:24 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ బిల్లుపై హింసాత్మక నిరసనల వెనుక విపక్షాల ప్రమేయం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీతో పాటు ఆ పార్టీ మిత్రపక్షాలు గందరగోళం సృష్టిస్తున్నాయని, దిక్కుతోచని స్ధితిలో హింసకు దిగుతున్నాయని ఆరోపించారు. ఆందోళనలు చేస్తున్న వారిని వారి దుస్తులను బట్టి గుర్తించవచ్చని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్‌ వాదననే కాంగ్రెస్‌ ముందుకు తెస్తోందని ఎద్దేవా చేశారు.

జార్ఖండ్‌లో ప్రధాని మోదీ ఆదివారం ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ పౌర బిల్లుపై రాద్ధాంతం చేయడం తగదని హితవు పలికారు. పాకిస్తాన్‌, ఆప్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌ల నుంచి భారత్‌కు పారిపోయి వచ్చిన మైనారిటీ వర్గాలు శరణార్ధులుగా బతుకీడుస్తున్నారని, వారికి గౌరవప్రదమైన స్ధానం ఇవ్వాల్సిన అవసరం ఉందని పౌరసత్వ సవరణ బిల్లును పార్లమెంట్‌ ఉభయసభలూ ఆమోదించాయని గుర్తుచేశారు. మరోవైపు పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ నిరసనలు కొనసాగుతున్నాయి. నిరసనల నేపథ్యంలో బెంగాల్‌లో కొన్ని ప్రాంతాల్లో ఇంటర్‌నెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది.

>
మరిన్ని వార్తలు