కేజ్రీ సర్కార్‌పై మోదీ ఫైర్‌

4 Feb, 2020 17:49 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అరవింద్‌ కేజ్రీవాల్‌ సారథ్యంలోని ఢిల్లీ సర్కార్‌ ప్రజా సమస్యలను విస్మరించిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ఢిల్లీ వాసులకు ప్రధాని ఆవాస్‌ యోజన కింద ఇళ్లను నిర్మించేందుకు ఆప్‌ సర్కార్‌ చొరవ చూపలేదని దుయ్యబట్టారు. రానున్న ఢిల్లీ ఎన్నికలు ఈ దశాబ్ధంలో తొలి ఎన్నికలని భారత్‌ భవితవ్యానికి ఈ ఎన్నికలు కీలకమైనవని, అభివృద్ధిని కాంక్షించే బీజేపీకి ఓటర్లు పట్టం కట్టాలని కోరారు. దేశ రాజధానిలోని ద్వారకా ప్రాంతంలో మంగళవారం ప్రచార ర్యాలీని ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ పలు కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం నిరాకరించిందని ఆరోపించారు.

పేదలకు రూ 5 లక్షల వరకూ ఉచిత వైద్య చికిత్సలు కల్పించే ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని ఢిల్లీ పేదలు ఉపయోగించుకోలేకపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత ఏ ప్రభుత్వమూ చేయనంత వేగంగా దేశాన్ని తమ ప్రభుత్వం వేగంగా అభివృద్ధి దిశగా నడిపించిందని చెప్పుకొచ్చారు. సీఏఏ, ఆర్టికల్‌ 370 వంటి జాతీయ భద్రతకు సంబంధించిన అన్నినిర్ణయాలకు తోడ్పాటును అందించే నాయకత్వం ఢిల్లీకి అవసరమని ఆకాంక్షించారు. బాట్లా హౌస్‌ ఉగ్రవాదుల పట్ల కన్నీరు కార్చే ఈ నాయకులు భద్రతా దళాల త్యాగాలను స్మరించలేరని విపక్షాలను దుయ్యబట్టారు.

చదవండి : ‘పౌర నిరసనలపై ప్రధాని కీలక వ్యాఖ్యలు’

మరిన్ని వార్తలు