ఆర్‌బీఐని తరలించే కుట్ర

24 Sep, 2014 22:24 IST|Sakshi
ఆర్‌బీఐని తరలించే కుట్ర

ముంబై: కేంద్ర ప్రభుత్వం భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ)ని న్యూఢిల్లీకి తరలించేందుకు కుట్ర పన్నుతోందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ్ రాణే ఆరోపించారు. దేశ వాణిజ్య రాజధానిగా ఉన్న ముంబై ప్రతిష్టను దిగజార్చేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఆర్‌బీఐని ఢిల్లీకి తరలించే ప్రక్రియ ప్రారంభమైందని, ఇప్పటికే మూడు విభాగాలను రెండు నెలల క్రితమే ముంబై దాటించారని చెప్పారు.

దేశ వాణిజ్య రాజధానిగా ముంబైకి ఉన్న ప్రాముఖ్యతను, ఈ నగరానికి ఉన్న ప్రపంచస్థాయి గుర్తింపును దిగజార్చేందుకు జరిగే ఎటువంటి ప్రయత్నాన్నైనా తీవ్రంగా వ్యతిరేకిస్తామని రాణే అన్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని తాను ఇప్పటికే ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌కు, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్‌కు లేఖలురాశానని చెప్పారు.

బుధవారం రాణే ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ, కేంద్రంలో వచ్చిన అనేక ప్రభుత్వాలు ముంబై దీవిపై కన్నేశాయని అన్నారు. కొన్ని దశాబ్దాల క్రితం ముంబైని గుజరాత్‌తో అనుసంధానం చేసేందుకు దివంగత మొరార్జీ దేశాయ్ కూడా ప్రయత్నించారని అన్నారు. 1956 అనంతరం జరిగిన భారీ ఆందోళనలు, 105 మంది ప్రాణ త్యాగం ఫలితంగా ముంబై (అప్పట్లో బొంబాయి)ని మహారాష్ట్ర వాసులు దక్కించుకున్నారని చెప్పారు. అలాగే మరాఠీ మాట్లాడేవారితో మహారాష్ట్ర గుజరాత్‌తో వేరుపడిందని తెలిపారు. అప్పట్లో బొంబాయి ద్విభాషా రాష్ట్రంగా ఉండేదన్నారు.

 రిజర్వు బ్యాంకును ముంబై నుంచి తరలించడంతో పాటు నగరాన్ని మహారాష్ట్ర నుంచి వేరుచేసి కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చేందుకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని రాణే ఆరోపించారు. ఈ ప్రతిపాదన గతంలో అనేకసార్లు వచ్చిందని, అయితే మహారాష్ట్రలోని అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించారని చెప్పారు. ముంబై నౌకాశ్రయంలో సాగుతున్న కంటెయినర్ వ్యాపారాన్ని గుజరాత్‌కు తరలించాలని కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని రాణే తెలిపారు. ఈ నిర్ణయం వల్ల సుమారు 1,800 ఎకరాల భూమి వృథాగా మారుతుందని అన్నారు. రూ.75వేల కోట్ల విలువైన ఆ భూమిని అధికార బీజేపీకి సన్నిహితుడైన పారిశ్రామికవేత్తకు అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని రాణే ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఈ ప్రయత్నాలన్నింటినీ అడ్డుకుంటుందని రాణే స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు