తెలంగాణ తొలి కరోనా బాధితుడితో మోదీ మన్‌ కీ బాత్‌ 

29 Mar, 2020 14:36 IST|Sakshi

న్యూఢిల్లీ/ హైదరాబాద్‌ : మన్ కీ బాత్‌లో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ కరోనా పాజిటివ్‌ వచ్చిన తొలి తెలంగాణ యువకుడితో ఫోన్‌లో మాట్లాడారు. ఆదివారం సదరు యువకుడు తన అనుభవాలను మోదీతో పంచుకున్నాడు.
ప్రధాని మోదీకి యువకుడికి మధ్య జరిగిన సంభాషణ

మోదీ : ఎస్ రాం 
రామ్ గంప తేజా : నమస్కారమండీ.
మోదీ : ఎవరు? రామ్ గారేనా మాట్లాడేది.
రామ్ గంప తేజా : అవును సర్. రామ్ను మాట్లాడుతున్నాను. 
మోదీ : రామ్ నమస్తే.
రామ్ గంప తేజా : నమస్తే.. నమస్తే..
మోదీ : మీరు కరోనా వైరస్ పెను ప్రమాదం నుంచి బయటపడ్డారని విన్నాను.
రామ్ గంప తేజా : అవును సార్.
మోదీ : మీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను. చెప్పండి మీరు పెను ప్రమాదం నుంచి ఎట్లా బయటపడ్డారు. మీ అనుభవాలు వినాలనుకుంటున్నాను. 
రామ్ గంప తేజా : నేను ఐటీ రంగంలో పని చేసే ఉద్యోగిని. పనిలో భాగంగా మీటింగ్స్ కోసం దూబాయ్ వెళ్లాల్సి వచ్చింది. అక్కడ అనుకోకుండానే అలా జరిగిపోయింది. తిరిగి రాగానే జ్వరంలాంటివి మొదలయ్యాయి సార్. ఆ తర్వాత ఐదారు రోజులకు డాక్టర్లు కరోనా వైరస్ పరీక్షలు జరిపారు. అప్పుడు పాజిటివ్ వచ్చింది. వెంటనే హైదరాబాద్లోని ప్రభుత్వ గాంధీ హాస్పిటల్లో నన్ను చేర్చారు. ఆ తర్వాత 14 రోజులకి నాకు నయమైంది. డిశ్చార్జి చేశారు. నిజంగా అదంతా ఎంతో భయంకరంగా సాగింది. 
మోదీ : అంటే మీకు కరోనా వైరస్ సోకిందన్న విషయం తెలిసింది?. 
రామ్ గంప తేజా : అవును సార్. 
మోదీ : మీకు ఈ వైరస్ ఎంతో భయంకరమైనదన్న అన్న విషయం ముందే తెలుసుకదా. జ్వరంతో బాధ పడుతున్నారు కదా.
రామ్ గంప తేజా : అవును సార్.
మోదీ : అయితే వైరస్ సోకిన విషయం తెలియగానే మీకు ఏమనిపించింది. 
రామ్ గంప తేజా : ఒక్కసారిగా భయంవేసింది. ముందైతే నేను నమ్మలేకపోయాను. ఇట్లా ఎట్లా జరిగిందో అర్థం కాలేదు. ఎందుకంటే భారత దేశంలో కేవలం ఇద్దరి, ముగ్గురికే ఈ వ్యాధి సోకింది. అందుకే ఏమీ అర్థం కాలేదు. ఆస్పత్రిలో చేరిన తర్వాత నన్ను క్వారంటైన్లో ఉంచారు. రెండు, మూడు రోజులు అట్లాగే గడిచిపోయాయి. అక్కడ ఉన్న డాక్టర్లు... నర్సులు... 
మోదీ : ఆ ఇంకా...
రామ్ గంప తేజా : వాళ్లు ఎంతో మంచివాళ్లు. ప్రతిరోజూ నాకు ఫోన్ చేసి మాట్లాడేవాళ్లు నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేవాళ్లు నాకు ఏమీ కాదన్న నమ్మకాన్ని కలిగించే వాళ్లు. మీరు తొందరగా కోలుకుంటారు. అంటూ ఇట్లాంటి మాటలు మాట్లాడే వాళ్లు. పగటి పూట ఇద్దరు, ముగ్గురు డాక్టర్లు మాట్లాడేవాళ్లు. నర్సులు కూడా మాట్లాడేవాళ్లు. మొదట్లో భయం వేసింది. కాని క్రమంగా ఇంతమంది మంచివాళ్ల మధ్య ఉన్న కారణంగా నాకేమీ కాదన్న నమ్మకం కుదిరింది. ఏంచేయాలో వాళ్లకి తెలుసు. తప్పనిసరిగా నాకు మెరుగవుతుంది అన్న విశ్వాసం పెరిగింది. 
మోదీ : మీకుటుంబ సభ్యుల మానసిక స్థితి ఎట్లా ఉండేది. 
రామ్ గంప తేజా : నేను ఆస్పత్రిలో చేరినప్పుడు మొదట్లో వాళ్లు ఎంతో ఆందోళనకు గురయ్యారు. ఇక్కడ మీడియా కూడా కొంత సమస్యాత్మకంగా మారింది. ఆతర్వాత మాకుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు చేశారు. నెగిటివ్ వచ్చింది. నాకూ, నాకుటుంబ సభ్యులకూ, చుట్టు పక్కల వారికి కూడా ఎంతో ఊరటనిచ్చింది. ఆ తర్వాత రోజురోజుకీ నా పరిస్థితిలో మెరుగుదల కన్పించింది. డాక్టర్లు మాతో మాట్లాడేవారు. కుటుంబ సభ్యులకు కూడా విషయాలు చెప్పేవారు. వారు ఏఏ జాగ్రత్తలు తీసుకుంటున్నారో ఏవిధంగా చికిత్స చేస్తున్నారో అన్ని విషయాలు కుటుంబ సభ్యులకు తెలిపేవారు. 
మోదీ : మీరు స్వయంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకునేవారు. మీ కుటుంబ సభ్యులు ఏ ఏ జాగ్రత్తలు తీసుకునేవారు? 
రామ్ గంప తేజా : నేను క్వారంటైన్ లోకి వెళ్లిన తర్వాతే ఈ విషయం తెలిసింది. అయితే క్వారంటైన్ తర్వాత కూడా మరో 14 రోజులు పడుతోందని డాక్టర్లు చెప్పారు. ఆ 14 రోజులు ఇంటి దగ్గరే ఒక గదిలో ఉండాలని చెప్పారు. వారిని ఇంట్లో తమకుతాముగా క్వారంటైన్లో ఉండాలని కోరారు. నేను ఆస్పత్రి నుంచి వచ్చిన తర్వాత కూడా ఇంట్లోనే ఒక గదిలో ఉండేవాన్ని.. దాదాపుగా రోజంతా ఎక్కువసేపు మాస్క్ తగిలించుకొని ఉండేవాన్ని. తినడానికి గదిలోంచి బయటికి వచ్చే ముందు చేతులను శుభ్రంగా కడుక్కునేవాడిని. ఇది ఎంతో ముఖ్యం.
మోదీ : సరే రామ్.. మీరు ఆరోగ్యం పుంజుకొని బయటికి వచ్చారు. మీకు, మీకుటుంబ సభ్యులకు ఎన్నోన్నో శుభాకాంక్షలు. 
రామ్ గంప తేజా : ధన్యవాదాలు సార్.
మోదీ : కానీ మీ ఈ అనుభవం... 
రామ్ గంప తేజా : ఆ సార్..
మోదీ : మీరు ఐటీ ప్రొఫెషన్లో ఉన్నారు.. కదా...
రామ్ గంప తేజా : చెప్పండి సార్..
మోదీ : అయితే ఆడియో తయారు చేసి...
రామ్ గంప తేజా : ఆ సర్...
మోదీ : ఇతరులతో పంచుకోండి... ప్రజలతో పంచుకోండి. దీనిని సామాజిక మాధ్యమంలో వైరల్ చేయండి. ఈ విధంగా చేస్తే ప్రజలు భయాందోళనలకు గురికాకుండా ఉంటారు. ఏవిధమైన జాగ్రత్తలు తీసుకోవాలో కాడా తెలుస్తుంది. ఈ ప్రాణాంతక వ్యాధి నుంచి దూరంగా ఉండడానికి తమనుతాము కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు. 
రామ్ గంప తేజా : అవును సార్. బయటికివచ్చి చూస్తున్నాను క్వారంటైన్ అంటే తమకు తాము జైలులో ఉన్నట్లుగా భావిస్తున్నారు. ఇది నిజంగా ఇలాంటిది కాదు. అందరూ అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం చెబుతున్న క్వారంటైన్ కేవలం వారికే కాదు, వారి కుటుంబ సభ్యులకు కూడా మంచిది. అందుకే.. ఎంతో మందికి ఈ విషయాలను చెప్పాలనుకుంటున్నాను. పరీక్షలు చేయించుకోండి. క్వారంటైన్ అంటే భయపడకండి. క్వారంటైన్ అంటే అదేదో మచ్చలాంటిది అనుకోకండి. 
మోదీ : మంచిది రామ్. మీకు ఎన్నెన్నో శుభాకాంక్షలు.
రామ్ గంప తేజా : ధన్యవాదాలు.. ధన్యవాదాలు...
మోదీ : ధన్యవాదాలు..
రామ్ గంప తేజా : సార్ ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. 
మోదీ : ఆ చెప్పండి... చెప్పండి.
రామ్ గంప తేజా : నాకు చాలా సంతోషంగా ఉంది సార్. మీరు తీసుకున్న చర్యలు ప్రపంచంలో ఏ దేశం కూడా తమ పౌరుల కోసం తీసుకోలేదు. అంతేకాదు మీ కారణంగా మేమందరం కూడా క్షేమంగా బయట పడగలమని ఆశిస్తున్నాను. 
మోదీ : ఈ వైపరిత్యం నుంచి దేశ బయటపడాలి. ఇది ఎంతో భయానకమైన పరిస్థితి. ఎప్పుడు ఏమవుతుందో తెలియని స్థితి.
రామ్ గంప తేజా : ఏమీ కాదు సార్. మొదట్లో నాకు భయం వేసింది. మీరు లాక్ డౌన్ ప్రకటించినప్పుడు. మీరు తీసుకుంటున్న చర్యలు చూస్తుంటే నాలో నమ్మకం పెరుగుతోంది. మనందరం మీ సహాయంతో బయటపడతాం సార్. ధన్యవాదాలు సార్.
మోదీ : ధన్యవాదాలు సోదరా... ఎన్నెన్నో కృతజ్ఞతలు.
రామ్ గంప తేజా : ధన్యవాదాలు సర్.
మోదీ : దేశవాసులారా... రామ్ గంప తేజా  గారు చెప్పినట్లు ఆయనకు కరోనా సోకిన విషయం తెలిసిన తర్వాత డాక్టర్లు ఇచ్చిన ఆదేశాలను తూచాతప్పకుండా పాటించారు. ఆ కారణంగానే ఆయన ఆరోగ్యవంతుడై మళ్లీ సాధారణ జీవితాన్ని గడపగలుగుతున్నారు.

మరిన్ని వార్తలు