లోక్‌సభలో మాట్లాడనీయట్లేదు!

11 Dec, 2016 02:10 IST|Sakshi
లోక్‌సభలో మాట్లాడనీయట్లేదు!

అందుకే జనసభల్లో చెబుతున్నా: మోదీ
- మున్ముందు మరిన్ని కఠిన నిర్ణయాలు..
- అయితే.. 50 రోజుల్లో నోట్లరద్దు కష్టాలు తగ్గుముఖం పడతాయి
- నగదు రహితంతోనే చాలా సమస్యలకు పరిష్కారం
- ప్రజలను ‘డిజిటల్‌’పై చైతన్యపరచాలని పార్టీ కార్యకర్తలకు సూచన  


దీసా/గాంధీనగర్‌ (గుజరాత్‌): రానున్న కాలంలో మరిన్ని కఠినమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి రావొచ్చని ప్రధానమంత్రి మోదీ దేశప్రజలను హెచ్చరించారు. అయితే.. నోట్ల రద్దు వల్ల ఎదురవుతున్న ఇబ్బందులు 50 రోజుల తర్వాత సాధారణ స్థితికి వస్తాయని తెలిపారు. గుజరాత్‌లోని బనస్కాంత జిల్లా దీసాలో రూ. 350 కోట్ల వ్యయంతో నిర్మించిన వెన్న తయారీ కేంద్రాన్ని మోదీ శనివారం ప్రారంభించి ప్రసంగించారు. నోట్లరద్దుపై ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు మెల్లిగా తగ్గుముఖం పడతాయన్నారు. ‘ఇదేం సాధారణమైన నిర్ణయం కాదు. దీని వల్ల సమస్యలు వస్తాయని తొలి రోజు నుంచీ చెబుతున్నాను. 50 రోజుల వరకు సమస్యలుంటాయి. రోజురోజుకీ సమస్య పెరుగుతుంది. కానీ ఆ తర్వాత (50 రోజుల తర్వాత) పరిస్థితులు సర్దుకుంటాయి.

మీ కళ్లముందే అంతా జరుగుతుంది’ అని అన్నారు.  నోట్లరద్దును కారణంగా చూపి పార్లమెంటు కార్యకలాపాలకు అడ్డుపడుతున్న విపక్షాలపైనా మోదీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. విపక్షాలు వ్యవహరిస్తున్న తీరు అసంతృప్తికరంగా ఉందన్నారు. ‘నేను లోక్‌సభలో మాట్లాడకుండా విపక్షాలు అడ్డుకుంటున్నాయి. అందుకే జనసభలో మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. కానీ మాట్లాడే అవకాశం వచ్చినపుడు లోక్‌సభలో 125 కోట్ల మంది ప్రజల గొంతుకను వినిపిస్తా. విపక్షాలు సభలో వ్యవహరిస్తున్న తీరుపై రాష్ట్రపతి కూడా అసంతృప్తితో ఉన్నారు’ అని ప్రధాని చెప్పారు. ప్రజల కష్టాలను చూపుతూ తనను విమర్శిస్తున్నవారంతా.. ప్రజలకు మొబైల్‌ బ్యాంకింగ్‌ విషయాన్ని అర్థమయ్యేలా వివరిస్తే బాగుంటుందన్నారు.

విపక్షాలు కోరుతున్నట్లుగానే నోట్లరద్దుపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. భారతీయులంతా నోట్ల రద్దుకు మద్దతుగానే ఉన్నారని అయితే.. అమలు సరిగా ఉండాలనే వారు కోరుకుంటున్నారని మోదీ తెలిపారు. ‘నోట్లరద్దుతో ఉగ్రవాదం, నక్సలిజాల వెన్నెముక విరిగిపోయింది. అవినీతి, నల్లధనంపై చేస్తున్న ఈ పోరాటం వల్ల నిజాయితీగా ఉన్న వారికి, పేదలు, అణగారిన వర్గాలకు న్యాయం జరుగుతుంది’అని ప్రధాని వెల్లడించారు. నోట్లరద్దు కష్టాలనుంచి బయటకు వచ్చేందుకు నగదురహిత ఆర్థిక వ్యవస్థవైపు పయనించాల్సిన అవసరముందని ప్రజలను కోరారు. నల్లధన కుబేరులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. కొందరు తనను కలసి నోట్లరద్దును వారం రోజులు వాయిదా వేయమని కోరారని మోదీ తెలిపారు. పార్టీలకతీతంగా డిజిటల్‌ లావాదేవీలవైపు ప్రజలను నడిపించేందుకు విపక్షాలు ప్రభుత్వంతో కలసిరావాలని మోదీ కోరారు.

ప్రజలను చైతన్యపరచండి.. గాంధీనగర్‌లో బీజేపీ కార్యకర్తలనుద్దేశించి మోదీ మాట్లాడారు. డిజిటల్‌ లావాదేవీలపై ప్రజలను ప్రోత్సహించేలా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. దీనివల్ల అవినీతిని పారదోలవచ్చన్నారు. కొన్నేళ్లుగా దేశ ఆర్థిక వ్యవస్థ శిథిలమౌతూ వస్తోందని.. దీన్ని బలోపేతం చేసేందుకు నగదు రహిత లావాదేవీలను ప్రజలకు అర్థం చేయించాలన్నారు. కేంద్ర పథకాలను చివరి లబ్ధిదారుడి వరకు చేరేలా కృషిచేయాలన్నారు.

మోదీ అభివృద్ధి ఎజెండాపై ఫీచర్‌ ఫిల్మ్‌  
ముంబై: మోదీ అభివృద్ధి ఎజెండా, దేశంలో మార్పునకు సంబంధించి ఆయన దృక్పథంపై పూర్తి స్థాయి ఫీచర్‌ ఫిల్మ్‌ నిర్మిస్తున్నట్ల బిహార్‌కు చెందిన సినీ నిర్మాత వెల్లడించారు. ‘మోదీ కా గావ్‌’ పేరుతో 2 గంటల 15 నిమిషాల నిడివి గల ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని ప్రస్తుతం  పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌లో వుంది.

తల్లిని కలిసిన మోదీ
గుజరాత్‌ పర్యటనలో మోదీ తన తల్లి హీరాబెన్‌ను కలిశారు. బీజేపీ కార్యకర్తలతో భేటీకి ముందు గాంధీనగర్‌ శివార్లలోని రైజాన్‌లో సోదరుడు పంకజ్‌ మోదీ ఇంటికెళ్లిన ప్రధాని.. అక్కడ తల్లితో కాసేపు మాట్లాడి ఆశీస్సులు తీసుకున్నారు. 20 నిమిషాల సేపు మోదీ తల్లితో గడిపారు. సెప్టెంబర్‌ 17న తన పుట్టినరోజు (గుజరాత్‌ పర్యటనలో ఉన్నారు) సందర్భంగా కూడా మోదీ తల్లి ఆశీస్సులు తీసుకున్నారు.

అడ్డుకోవటం లేదు: కాంగ్రెస్‌
తనను పార్లమెంటులో మాట్లాడకుండా విపక్షాలు అడ్డుకుంటున్నాయన్న మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ తీవ్రంగా స్పందించింది. నోట్లరద్దుపై ప్రజలకు మోదీ అవాస్తవాలు చెబుతున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఆనంద్‌ శర్మ విమర్శించారు. అబద్ధాలు చెప్పటం అలవాటుగా మార్చుకున్న మోదీని పార్లమెంటులో మాట్లాడకుండా ఎవరూ అడ్డుకోవటం లేదన్నారు. మోదీ మాట్లాడాలని డిమాండ్‌ చేస్తున్న విషయాన్ని గుర్తుచేసిన శర్మ.. తమ ప్రశ్నలకు ప్రధాని సమాధానం చెప్పాల్సి ఉంటుందని డిమాండ్‌ చేశారు. నోట్లరద్దును పార్లమెంటులో మోదీ ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు