'మోదీ కూడా ఆ వ్యాధితో బాధపడుతున్నారు'

26 Feb, 2016 16:48 IST|Sakshi
'మోదీ కూడా ఆ వ్యాధితో బాధపడుతున్నారు'

న్యూఢిల్లీ: 'రెండు పవర్ సెంటర్ల మధ్య ఇమడలేక మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్  మౌనీబాబాలా వ్యవహరించేవారు. ఇప్పుడు మోదీదీ అదే పరిస్థితి. ఇటు నాగ్ పూర్ ఆదేశాలు పాటించాలో లేక ఢిల్లీలోని అధికార యంత్రాంగం మాట వినాలో తెలియక మోదీ సతమతమవుతున్నారు. అందుకే మౌనాన్ని ఆశ్రయించి మిన్నకుండిపోయారు' అని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుల్తాన్ అహ్మద్ పార్లమెంట్ లో ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాధాలు తెలిపేక్రమంలో ఆ పార్టీ ఎంపీ సుల్తాన్ అహ్మద్ శుక్రవారం లోక్ సభలో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ మౌనీబాబా సిండ్రోమ్(వ్యాధి)తో బాధపడుతున్నారని వ్యాఖ్యానించారు.

56 ఇంచుల ఛాతీ ఉందని చెప్పే ప్రధాని.. జాట్ ఉద్యమం సందర్భంగా దేశ రాజధానికి 35 కిలోమీటర్ల దూరంలో అల్లర్లు చెలరేగి, రూ.34 వేల కోట్ల ప్రజాధనం బూడిద అయిపోయినా అడ్డుకోలేకపోయారని, గతంలో పటేళ్లు కూడా ఇదే మారిది విధ్వంసానికి దిగినా ప్రధాని ఒక్క మాటైనా మాట్లాడలేదని, అందుకే హోం మంత్రి రంగంలోకి దిగి కోటా ప్రకటన చేశారని అహ్మద్ అన్నారు. ప్రధాని మాట్లాడే ఒకే ఒక్క కార్యక్రమం 'మన్ కీ బాత్'ను కూడా ప్రజలు పట్టించుకోవడం మానేశారని ఎద్దేవాచేశారు.

మరిన్ని వార్తలు