రాయబారులతో మోదీ చర్చ

7 May, 2017 01:20 IST|Sakshi
రాయబారులతో మోదీ చర్చ

న్యూఢిల్లీ: 120 దేశాల్లోని భారత రాయబారులు, హైకమిషనర్లు పాల్గొన్న 8వ భారత హెడ్స్‌ ఆఫ్‌ మిషన్‌ సదస్సునుద్దేశించి శనివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో భారత విదేశాంగ విధానంలో కీలక అంశాలతో పాటు సవాళ్లపై ప్రధానంగా చర్చించనున్నారు. ప్రపంచంలోని శక్తిమంతమైన దేశాలతో భారత సంబంధాలు, పాకిస్తాన్, చైనాలతో ద్వైపాక్షిక సంబంధాల్లో ఉద్రిక్తతలపై కూడా సమీక్షిస్తారు.

ఈ మేరకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గోపాల్‌ బాగ్లే శనివారం ట్వీట్‌ చేశారు.  ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకున్న తాజా పరిణామాలు, వాటి విషయంలో భారత్‌ అవలంభించాల్సిన విధానాలపై కూడా చర్చిస్తారని సమాచారం. ముఖ్యంగా ట్రంప్‌ యంత్రాగంతో, రష్యాతో ద్వైపాక్షిక సంబంధాలు ప్రధానంగా ప్రస్తావనకు రానున్నాయి. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న దేశాలతో భారత్‌ ద్వైపాక్షిక సంబంధాలపై రాయబారులు నివేదికలు సమర్పించారు.

కలను నిజం చేశాం: మోదీ
‘దక్షిణాసియా ఉపగ్రహ ప్రయోగం ఒక కల, నిబద్ధత.. దాన్ని భారతదేశం నిజం చేసింద’ంటూ ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ట్వీట్‌ చేశారు. ప్రధాని కల నిజమైందంటూ ట్వీటర్‌ ఫాలోవర్‌ చేసిన ట్వీట్‌కు మోదీ సమాధానమిచ్చారు. అలాగే సైన్స్‌ సాయంతో పేదలు, నిర్లక్ష్యానికి గురైన వారి జీవితాల్ని మార్చవచ్చన్నారు.

మరిన్ని వార్తలు