మోదీ అన్నిదేశాలు ఎలా చుట్టొచ్చారంటే..

9 Apr, 2016 13:41 IST|Sakshi
మోదీ అన్నిదేశాలు ఎలా చుట్టొచ్చారంటే..

న్యూఢిల్లీ: 'దేశాన్ని అభివృద్ధి చేసేవరకు నేను నిద్రపోను' అని ఎన్నికల సమయంలో ప్రకటనలు గుప్పించడం నాయకులకు అలవాటే. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన ఆ మాటను ఆచరించేవారు మాత్రం అరుదు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీలా. దేశాభివృద్ధికి కీలకమైన విదేశీ పెట్టుబడులను రప్పించేందుకు ఆయన కృషి అమోఘం. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు అనేక విదేశీ పర్యటనలు చేసిన మోదీ అద్భుతమైన టైమ్ మేనేజ్ మెంట్తో క్షణకాలాన్ని కూడా వృధా చేయటంలేదు. ఎలాగంటే..

నరేంద్ర మోదీ విదేశాలకు వెళ్లినప్పుడు నేరుగా నిర్దేశిత కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ వెంటనే మరో కార్యక్రమం. లేదంటే మరో దేశానికి వెళ్లిపోతారు కానీ ఎక్కడా విశ్రాంతి కోసమో, భోజనం చేసేందుకో హోటళ్లకు వెళ్లరు. అలాంటి బ్రేక్ల వల్ల విలువైన సమయం వృథా అవుతుందని మోదీ భావిస్తారు. విదేశీ పర్యటనల సమయంలో ప్రధాని తన విమానం (ఎయిర్ ఇండియా వన్) లోనే నిద్రపోతారు. ఆ విధంగా  సమయాన్ని ఆయన తన కంట్రోల్ లో ఉంచుకుంటారు. టైమ్ మేనేజ్ మెంట్ పై పూర్తి అవగాహన ఉండటం వల్లే ఆయన తక్కువ సమయంలో ఎక్కువ దేశాల్లో పర్యటించగలుగుతున్నారు.
 
ప్రధాని మోదీ మార్చి 30 నుంచి ఏప్రిల్2 వరకు బెల్జియం, అమెరికా, సౌదీ అరేబియా దేశాల్లో పర్యటించిన విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి బ్రస్సెల్, అక్కడ నుంచి వాషింగ్టన్, అటు నుంచి రియాద్ వరకు ప్రయాణిస్తున్న సమయంలో మూడు రాత్రులు ఎయిర్ ఇండియా వన్ విమానంలోనే నిద్రపోయారు. కేవలం రెండు రాత్రులు మాత్రమే వాషింగ్టన్, రియాద్‌లోని హోటల్‌లోబస చేశారు. మోదీ విమానంలోనే నిద్రపోవటం వల్లే కేవలం 97 గంటల్లోనే అమెరికాలాంటి దేశాలతో కలుపుకుని మూడు దేశాల్లో పర్యటించడం సాధ్యమైందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.  

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విదేశీ పర్యటనలు, చాలా వరకు అంతార్జాతీయ సదస్సులు ఉండేవి. అవి కూడా ఏదో ఒక దేశానికే ప్రయాణించేలా ఉండేవి. రాత్రికి రాత్రి ప్రయాణాలు చాలా అరుదుగా ఉండేవి. కానీ ఇప్పుడు సమయాన్ని హోటళ్లలో వృథా కాకుండా మోదీ విదేశీ పర్యటనలకు ప్రణాళికలు చేసుకుంటున్నారని అధికారులు అంటున్నారు. రెండు సంవత్సరాలలో మోదీ 95 రోజులు విదేశాల్లో పర్యటించారు. గత ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ తొలి రెండు సంవత్సరాలలో 72 రోజులు విదేశాల్లో పర్యటించారు. రెండేళ్లలో 20 పర్యటనల్లో మోదీ 40 దేశాలు చుట్టారు. యూపీఏ1 హయాంలో మన్మోహన్ సింగ్ 15 పర్యటనల్లో 18 దేశాల్లో పర్యటించగా, యూపీఏ 2లో 17 పర్యటనల్లో 24దేశాల్లో మాత్రమే పర్యటించగలిగారు.

మరిన్ని వార్తలు