‘హింసాత్మక నిరసనలు వద్దు’

17 Dec, 2019 18:37 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న యూనివర్సిటీ, కళాశాలల విద్యార్ధులు ప్రజాస్వామ్య పద్ధతుల్లో తమ నిరసన తెలపాలని ప్రధాని  నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వంతో తమ ఆలోచనలను ముందుకు తెస్తే సంప్రదింపులు జరపవచ్చని జార్ఖండ్‌లోని బరహత్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పౌర బిల్లుపై విద్యార్ధుల నిరసనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగమే తమకు పవిత్ర గ్రంధమని, తమ విధానాలపై కళాశాలల్లో విద్యార్ధులు చర్చించవచ్చని ప్రజాస్వామ్యయుతంగా నిరసనలు తెలపవచ్చని ఆయన సూచించారు. విద్యార్ధులు చెప్పే విషయాలను ప్రభుత్వం ఆలకిస్తుందని, అయితే కొన్ని రాజకీయ పార్టీలు, అర్బన్‌ నక్సల్స్‌ విద్యార్ధుల భుజాలపై నుంచి తమపై తుపాకులు ఎక్కుపెట్టారని ప్రధాని ఆరోపించారు.

పౌరసత్వ సవరణ చట్టంపై ముస్లింలలో భయాందోళనలు కలిగేలా కాంగ్రెస్‌ అసత్యాలు ప్రచారం చేస్తోందని, ఈ చట్టం ద్వారా ఏ పౌరుడికీ ఇబ్బంది ఉండదని తాను భరోసా ఇస్తున్నానని అన్నారు. మరోవైపు నూతన పౌర చట్టాన్ని అథ్యయనం చేయాలని ఆందోళన చేపట్టిన విద్యార్ధులకు హోంమంత్రి అమిత్‌ షా విజ్ఞప్తి చేశారు. ఈ చట్టం ఎవరి ప్రయోజనాలకూ విఘాతం కలిగించదని స్పష్టం చేశారు. ఇక ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ చేపట్టిన నిరసనల్లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. విద్యార్ధులు చేపట్టిన ర్యాలీలో కొందరు పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జ్‌ చేయడంతో పాటు భాష్పవాయుగోళాలను ప్రయోగించారు.

మరిన్ని వార్తలు