నవంబర్‌ 28న హైదరాబాద్‌కు ప్రధాని

4 Oct, 2017 03:05 IST|Sakshi

     గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ సమ్మిట్‌కు హాజరుకానున్న మోదీ

     ట్రంప్‌ కుమార్తెతో కలసి సదస్సును ప్రారంభించనున్న ప్రధాని

సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో వచ్చే నెల 28 నుంచి 30వ తేదీ వరకు జరగనున్న గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ సమ్మిట్‌ (జీఈఎస్‌–2017)కు ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కుమార్తె ఇవాంక ట్రంప్‌తో కలసి మోదీ ఈ సదస్సును ప్రారంభించనున్నారు. ఈ సదస్సుకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు మంగళవారం ఢిల్లీలోని నీతి ఆయోగ్‌ కార్యాలయంలో ఇరు దేశాల ఉన్నతస్థాయి ప్రతినిధులు సమావేశమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఔత్సాహిక, వర్ధమాన వాణిజ్యవేత్తలు, ప్రముఖ వ్యాపారవేత్తలు ఈ సదస్సులో పాల్గొననున్నారు. నెట్‌వర్కింగ్, వర్క్‌షాపులు, మార్గదర్శకత్వం అందించడం ద్వారా జీఈఎస్‌ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ఆలోచనలను కార్యరూపంలోకి తేనుంది.

భాగస్వామ్యాలను కుదర్చడం, నిధులు సమకూర్చడం వంటి కార్యక్రమాలకు జీఈఎస్‌ వేదిక కానుంది. ఏటా విభిన్న ప్రాంతాల్లో జరిగే ఈ సదస్సు ఈ ఏడాది మహిళా పారిశ్రామికవేత్తలు అనే అంశంపై ప్రధానంగా దృష్టిపెడుతుంది. సదస్సుకు మొత్తం 160 దేశాల నుంచి 1600 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. సదస్సు నిర్వహణలో నీతిఆయోగ్‌ కీలక పాత్ర పోషిస్తోంది. భారత ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఈ సదస్సు అద్వితీయ అవకాశమని నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ మంగళవారం సమావేశం సందర్భంగా పేర్కొన్నారు. హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించనున్న ఈ సదస్సుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందన్నారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా